మ్యాక్స్‌వెల్ సేవల్ని వృథా చేస్తున్నారు: ఏడో స్థానంలో ఆడించడంపై బోర్డర్

హైదరాబాద్: ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించడంపై ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం అలెన్ బోర్డర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ను సరైన స్థానంలో ఆడించకుండా అతడి సేవల్ని వృథా చేస్తున్నారని అతడు మండిపడ్డాడు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అలెన్ బోర్డర్ మాట్లాడుతూ "భారత్‌తో తొలి వన్డేలో మ్యాక్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించి అతని సేవల్ని వృథా చేసినట్లే అనిపించింది. ఇక ముందైనా అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి. మిడిల్ ఆర్డర్‌లో మ్యాక్స్‌వెల్ సేవల్ని వినియోగించుకోవాలి. ఆటలో పరిస్థితిని బట్టి మీకు మంచి ఆరంభం కావాలంటే అతడిని మూడో స్థానంలో ఆడించొచ్చు" అని పేర్కొన్నాడు.

మాక్స్‌వెల్‌ను ఏడో స్థానంలో
సాధారణంగా మాక్స్‌వెల్‌ను సందర్భాన్ని బట్టి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో జట్టు మెనేజ్‌మెంట్ ఆడిస్తూ ఉంటుంది. అయితే, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో మాత్రం మాక్స్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించారు. ఏడో స్థానంలో ఆడిన అతడు కేవలం ఐదు బంతుల్ని మాత్రమే ఎదుర్కొని 11 పరుగులు చేశాడు.

మంచి ఆరంభం కావాలంటే
మంచి ఆరంభం కావాలంటే, జట్టుకు ప్రయోజనం చేకూరాలంటే మ్యాక్స్‌వెల్‌ను వన్‌డౌన్ (మూడో స్థానంలో) క్రీజులోకి పంపించాలని బోర్డర్ సూచించాడు. ఆ స్థానంలో అయితే అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడని, అతడు సాధ్యమైనన్ని పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

మ్యాక్స్‌వెల్ ప్రమాదకర ఆటగాడు
మ్యాక్స్‌వెల్ ప్రమాదకర ఆటగాడని, సాధ్యమైనన్ని ఎక్కువ బంతులు అతడు ఆడేలా టీమ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ చేయాలని స్పిన్ దిగ్గజం, ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సూచించాడు. మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి తనకు అవగాహన లేదని, అయితే అతడు బ్యాటింగ్ చేస్తుంటే ఆస్వాదిస్తానని మాజీ క్రికెటర్ మార్క్ వా అన్నాడు.

మాక్స్‌వెల్ అత్యధిక స్కోరు 102 పరుగులు
కాగా, వన్డేల్లో మాక్స్‌వెల్ అత్యధిక స్కోరు 102 పరుగులు. యావరేజి 30. బౌలర్‌గా 45 వికెట్లు తీశాడు. 4/46 అత్యుత్తమం. తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా, ఆపై బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి ఓటమిపాలైంది. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications