
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. తాజాగా మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని మైదానంలో అడుగుపెట్టారు. భారత ఆటగాళ్లు ప్రతిరోజూ మైదానంలో కఠోరంగా సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భారత జట్టు రెండుగా విడిపోయి.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. శిఖర్ ధావన్ ప్లేయింగ్ ఎలెవన్‌తో భువనేశ్వర్ కుమార్ జట్టు తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో భువనేశ్వర్ సేన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని జట్టు 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. మనీశ్ పాండే 45 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మనీశ్ పాండే అర్ధ శతకం బాదాడు. భువనేశ్వర్ కుమార్ తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భువీ సేన 17 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓపెనర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ 60 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో చెలరేగి అర్ధ శతకం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
మ్యాచుకు సంబందించిన ఫొటోలు, వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. వీడియోలో భారత బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే మ్యాచ్ వివరాలను తెలియజేశాడు. తేమతో కూడిన వాతావరణంలో ఆటగాళ్లు తలపడిన విధానం బాగుందన్నాడు. పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడారని ప్రశంసించారు. అయితే భువీ సేన త్వరగా లక్ష్యం ఛేదించడంతో.. వారికి మరో టార్గెట్ విధించామని కోచ్ తెలిపాడు. 4 ఓవర్లలో 40 పరుగుల లక్ష్యం నిర్దేశించామని వెల్లడించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేందుకు ఇలా చేశామని మహంబ్రే పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ జట్టును శ్రీలంకకు పంపించింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున సత్తా చాటిన ఆటగాళ్లను ఈ టూర్‌కు ఎంపిక చేసింది. కరోనాతో సావాసం చేస్తూ క్రికెట్ ఆడటం కష్టంగా మారిన తరుణంలో ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ ఈ ప్రయోగానికి తెరలేపింది. ఈ టూర్ సక్సెస్‌ఫుల్‌గా ముగిస్తే భవిష్యత్తులోనూ ఒకేసారి రెండు జట్లను బీసీసీఐ ఆడించనుంది. జూన్ 13 నుంచి సిరీస్ ఆరంభం కానుంది.