
కొలంబో: టీమిండియా సీనియర్ క్రికెటర్లకు గతంలో నెట్స్‌లో బంతులు వేశానని, వారికి బౌలింగ్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలిసేవని టీమిండియా యువ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ తెలిపాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తనకు పిలిస్తే పలికేంత దూరంలో ఉంటారని చెప్పాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా-బీ జట్టు శ్రీలంకతో ఈ నెల 18 నంచి పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఐపీఎల్, దేశవాలీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు ఈ పర్యటనలో బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.
శ్రీలంక పర్యటన సందర్భంగా కృష్ణప్ప గౌతమ్ మీడియాతో మాట్లాడాడు. 'నేను భారత్-ఏకు ఆడేటప్పుడు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఎలాంటి సందేహం కలిగినా నేరుగా వెళ్లి అడుగుతా. జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనతో చాలా సమయం గడిపా. ద్రవిడ్ సర్‌తో కలిసి మళ్లీ పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీమిండియాతో నా ప్రయాణం గురించి ఆయనను అడుగుతా. సుదీర్ఘ కాలం, భారీ మ్యాచులు ఆడేందుకు ఒక క్రికెటర్ ఏం చేయాలో ఆయనను అడిగి తెలుసుకుంటా. అన్ని ప్రశ్నలకూ ఆయన సమాధానం చెప్పగలరు' అని గౌతమ్ అన్నాడు.
భారత జట్టు సీనియర్ క్రికెటర్లకు గతంలో నెట్స్‌లో బంతులు వేశానని కృష్ణప్ప గౌతమ్ తెలిపాడు. వారికి బౌలింగ్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలిసేవన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం నెట్ సెషన్ ముగిశాక ప్రత్యేకంగా మాట్లాడేవారని వెల్లడించాడు. భారత జట్టుకు ఆడాలన్న కల నిజం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. కెప్టెన్ శిఖర్ ధావన్‌తో చాలాసార్లు మాట్లాడానని, అతడి వ్యక్తిత్వం, వైఖరి తెలుసుకున్నానని గౌతమ్ చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టులకు గౌతమ్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు.
ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజ్ కృష్ణప్ప గౌతమ్‌ని 9.25 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ ఈ సీజన్‌లో కృష్ణప్పకు ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. 'ఐపీఎల్‌లో నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఆట విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు. ధర గురించి పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. ఆటను ఎప్పుడూ ఎంజాయ్ చేయాలని మహీ భాయ్ (చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ) అమూల్యమైన సలహా ఇచ్చాడు. నీ సహజమైన శైలిలో ఆడు అని ఎప్పుడూ చెప్పేవాడు. మహీ సలహాలను ఆచరణలో పెడుతా. బాగా రాణించేందుకు ప్రయత్నిస్తా. ధోనీ సారథ్యంలో ఆడటం నా అదృష్టం' అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.