టీ20 వరల్డ్ కప్-2024లో శ్రీలంక వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన లంక ఇవాళ బంగ్లాదేశ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. డల్లాస్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 124 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సాంక (47; 28 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా శ్రీలంక పవర్‌ప్లేలో 53 పరుగులు సాధించింది. కానీ అదే జోరును ఇన్నింగ్స్ ఆఖరి వరకు కొనసాగించలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు క్రమంగా వికెట్లు సాధిస్తూ లంక బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. బంగ్లా బౌలర్ల ధాటికి చివరి ఎనిమిది ఓవర్లలో శ్రీలంక కేవలం ఒకే బౌండరీ మాత్రమే సాధించడం గమనార్హం. ముస్తాఫిజుర్, రిషద్ హొస్సేన్ చెరో మూడు, తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 19 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే నువాన్ తుషార్ (4/18) ధాటికి 28 పరుగులకే బంగ్లా మూడు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడిన జట్టును తౌహిద్ (40; 20 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు), లిటన్ దాస్ (36; 38 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నారు. ఆ తర్వాత లంక బౌలర్లు గొప్పగా పుంజుకున్నప్పటికీ అంతిమంగా బంగ్లానే విజయం సాధించింది.
కాగా, మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ హసరంగ ఓటమికి గల కారణాలు వివరించాడు. తమ బ్యాటర్ల పేలవ ప్రదర్శన వల్లనే రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యామని అన్నాడు. ''మొదటి 10 ఓవర్లు మంచిగా బ్యాటింగ్ చేశాం. కానీ మిడిల్ ఓవర్లలో చెత్తగా ఆడాం. బౌలింగ్ మా బలం. 150-160 పరుగులు చేసి ఉంటే, మా బౌలింగ్ దళంతో మ్యాచ్‌ను గెలిచేవాళ్లం. తీక్షణతో కలిసి ప్రత్యర్థిపై స్పిన్‌తో దాడి చేసేవాళ్లం. కానీ రెండు మ్యాచ్‌ల్లో మా బ్యాటర్లు నిరాశపరిచారు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం'' అని హసరంగ అన్నాడు.