Srilanka Historic Victory: ఎమోషనల్ అయిపోయిన సనత్ జయసూర్య.. అద్భుత విజయమంటూ కితాబు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్‌ను దసున్ షనక నేతృత్వంలోని శ్రీలంక జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయానంతరం శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య శ్రీలంక టీం ప్రదర్శనను వేనోళ్ల కొనియాడాడు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. శ్రీలంక ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిని గెలిచి 3-1తో ఆధిక్యం సంపాదించి సిరీస్ గెలిచింది. ఇక 30ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియన్లను ఓడించడం విశేషం.
ఈ మ్యాచ్‌లో వీక్షకులందరినీ నరాలు తెగే ఉత్కంఠకు గురి చేసి అద్భుతమైన పోటీని ప్రదర్శించిన శ్రీలంక జట్టుకు ఇది చిరస్మరణీయమైన విజయయాత్ర. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత.. శ్రీలంక అత్యధ్భుతంగా కమ్ బ్యాక్ అయింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచి చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
శ్రీలంక జట్టుకు అభినందనలు
ఇక శ్రీలంక మాజీ కెప్టెన్, దిగ్గజం జయసూర్య ట్వీట్ చేస్తూ.. '30 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఆసీస్‌పై అద్భుతమైన సిరీస్ విజయం సాధించినందుకు శ్రీలంక జట్టుకు అభినందనలు..! ఇదో అద్భుతమైన ప్రయత్నం. గాయ్స్ ఎంతో గొప్పగా ఆడారు. ఈ విజయం నన్ను చాలా ఉద్వేగానికి గురిచేస్తుంది' అంటూ సనత్ పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ కూడా నాలుగో వన్డేలో జట్టు ప్రదర్శన పట్ల అమితానందాన్ని వ్యక్తం చేశాడు.
అద్భుతంగా కమ్ బ్యాక్ అయిన శ్రీలంక
వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2తేడాతో సిరీస్ ఓటమిని చవిచూసింది. వన్డే సిరీస్‌లో ముందంజ వేయాలని శ్రీలంకన్ టీమ్ ప్లాన్ చేసినప్పటికీ.. మొదటి మ్యాచ్‌లో వారికి ఓటమి ఎదురైంది. అయినా ఆశలు కోల్పోకుండా.. వన్డే సిరీస్‌ను తమదైన స్టైల్లో గెలుచుకునేందుకు అత్యధ్భుత పోరాట పటిమ కనబర్చింది. వరుసగా 2, 3 వన్డేలు గెలిచి ఆధిక్యంలో వచ్చింది.
ఇక నాలుగో వన్డే విషయానికొస్తే.. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 49ఓవర్లలో 258పరుగులు చేసి ఆలౌట్ అయింది. ధనంజయ డిసిల్వా (61 బంతుల్లో 60), చరిత్ అసలంక (106 బంతుల్లో 110) 101పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం అందించారు. మిగతా బ్యాటర్లందరూ విఫలమవడంతో జట్టు ఛేజింగ్‌కు వీలుపడే స్కోరే చేయగలిగింది.

డేవిడ్ వార్నర్ పోరాడినా..
ఇక ఛేజింగ్లో ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 112 బంతుల్లో 99పరుగులతో దాదాపు ఛేజింగ్ భారాన్ని మోసి ఆస్ట్రేలియాను విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. అతను 99పరుగుల వద్ద అనూహ్యంగా స్టంప్ ఔట్ కావడంతో శ్రీలంక జట్టుకు విజయానికి కాస్త అనుకూలత ఏర్పడింది. ఇకపోతే కెప్టెన్ దాసున్ షనక ఆఖరి ఓవర్ వేయగా.. మొదటి ఐదు బంతుల్లో 14పరుగులొచ్చాయి.
ఆ ఓవర్లో కుహ్నేమాన్ ఫోర్లతో బెంబేలెత్తించాడు. ఇక ఆఖరి బంతికి 5పరుగులు కావాల్సిన తరుణంలో స్లో బంతిని వేయగా.. దాన్ని కుహ్నేమాన్ హిట్ చేయగా గాల్లోకి బంతి లేచింది. ఇక ఫీల్డర్ క్యాచ్ అందుకోవడంతో జట్టు సభ్యులతో పాటు.. స్టేడియంలో ప్రేక్షకుల సంబరాలు మిన్నంటాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications