
మాంఛెస్టర్ సిటీ: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొత్త బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. వాతావరణ శాఖ అధికారి అవతారాన్ని ఎత్తాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా- ఇంగ్లండ్‌లోని మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరి కొన్ని గంటల్లో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. అక్కడి వాతావరణం గురించి ప్రపంచానికి తెలియజేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతానికి వాతావరణం భేషుగ్గా ఉందని, వర్షం పడే సూచనలేవీ లేవని చెప్పుకొచ్చాడు.
వర్షం గురించి బెంగపడొద్దు..
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదికగా ఆరంభం కానున్న మ్యాచ్‌కు కొనసాగకుండా వరుణ దేవుడు ఎక్కడ అడ్డుపడతాడోనని బెంగ పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ సహా మొత్తం నాలుగు పోటీలు నీళ్ల పాలైన నేపథ్యంలో- ఈ మ్యాచ్ కూడా ఎక్కడ స్తంభించిపోతుందోననే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమౌతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మాంఛెస్టర్ వాతావరణంపై వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పటికప్నుడు అప్‌డేట్ ఇస్తున్నారు ఫొటోలతో సహా.
ప్రస్తుతానికి వాతావరణం బాగుందని, వర్షం పడే సూచనలేవీ లేవని స్పష్టం చేశారు. ఆకాశం నిర్మలంగా ఉందని, ఒకటీ, అరా తప్ప మేఘాలు కూడా కనిపించట్లేదని ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. మ్యాచ్ ఆరంభం కావడానికి ముందు- వాతావరణంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు చోటు చేసుకోకపోవచ్చని ఆయన అంచనా వేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
