హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సోమవారం రాఖీ పండుగని పురస్కరించుకుని రాఖీతో పాటు హెల్మెట్ కూడా బహుమతిగా ఇవ్వాలని ఎంపీ కవిత 'సిస్టర్స్ ఫర్ చేంజ్' అనే ప్రచారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ని శుక్రవారం పార్లమెంట్‌లో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభించారు. ఎంపీ కవిత చేపట్టిన ఈ ప్రచారానికి ముగ్ధుడైన సెహ్వాగ్ ఆమెపై ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు. ఎంపీ కవిత చేపట్టిన కార్యక్రమం ఓ మంచి ప్రయత్నమని సెహ్వాగ్ అన్నాడు.

'హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఓవర్‌స్పీడ్‌తో వెళ్లడమంటే పాస్‌పోర్ట్ లేకుండానే శ్మశాన వాటికకు వెళ్లడం' అని సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తొందరపడొద్దని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, మీరు అభిమానించే వ్యక్తులకు హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలని సెహ్వాగ్ సూచించాడు.