సిద్దార్ధ్ కౌల్ హ్యాట్రిక్.. తొలిరోజే 24 వికెట్లు!!

పటియాలా: ఆంధ్రతో మంగళవారం మొదలైన రంజీ మ్యాచ్‌లో పంజాబ్ స్పీడ్‌స్టర్ సిద్దార్థ్ కౌల్ (5/24) హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. ధ్రువ్ పాండవ్ స్టేడియంలో రంజీ ట్రోఫీ ఎలైట్ 'ఎ అండ్ బి' గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర.. కౌల్, విజయ్ చౌధరి, క్రిషాన్ అలాంగ్ ధాటికి 39.4 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ 40వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో శశికాంత్ (20), స్వరూప్ (0), అశిష్ (0)ను ఔట్ చేసి సిద్దార్ధ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.

108 పరుగులకే ఆలౌట్:
ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (0), ప్రశాంత్ (0)లు డకౌట్‌గా కాగా.. ప్రణీత్ (5), కెప్టెన్ రికీ భుయ్ (23 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇలా వచ్చి అలా వెళ్లారు. జట్టు టాప్ స్కోరర్‌గా బోడపాటి సుమంత్ (51 బంతుల్లో 22; 4 ఫోర్లు) నిలిచాడు. అనంతరం ఆంధ్ర బౌలర్లు షోయబ్ మొహమ్మద్ ఖాన్ (5/46), ఆశిష్ (5/50) ధాటికి పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మన్దీప్ సింగ్ (23), అన్మోల్ మల్హోత్రా (21) టాప్ స్కోరర్లు.

తొలిరోజే 24 వికెట్లు:
11 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 9.2 ఓవరల్లో 4 వికెట్లు నష్టపోయి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర 20 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రికీ భుయ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇరు జట్ల బౌలర్లు హడలెత్తించడంతో ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 24 వికెట్లు పడ్డాయి.

జాఫర్ కొత్త రికార్డు:
భారత వెటరన్ బ్యాట్స్‌మన్, మాజీ ఇండియా ఓపెనర్ వసీం జాఫర్ కొత్త రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 12,000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం మరో విశేషం. రంజీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో జాఫర్ తర్వాతి స్థానాల్లో దేవేంద్ర బుందేల (145), అమోల్ ముజుందర్ (136) ఉన్నారు.

టెస్టుల్లో రెండు ద్విశతకాలు:
వసీం జాఫర్ చివరిసారిగా 2008లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున జాఫర్ 31 టెస్టులు, రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో వెస్టిండీస్ (212), పాకిస్థాన్‌పై (202) ద్విశతకాలు బాదాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ముంబై, విదర్భ తరఫున వసీం మ్యాచ్‌లు ఆడాడు. రంజీల్లో మొత్తం 40 సెంచరీలు సాధించాడు. ఇటీవలే ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications