అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి మరో నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ భారత జట్టు కూర్పుపై చర్చలు మొదలయ్యాయి. ప్లేయర్ల బలాబలాల గురించి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు తీవ్రంగా చర్చిస్తున్నారు. అఫ్గానిస్థాన్ సిరీస్ అనంతరం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరల్డ్ కప్ జట్టులో తప్పక ఉండాలని భావిస్తున్నారు.
అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు. కానీ వెస్టిండీస్ కఠిన పిచ్‌లపై కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలని, ఇన్నింగ్స్‌కు ఇరుసులా అతడు మారాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మతో శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్‌లలో ఒకరికి ఓపెనింగ్ ఛాన్స్ కన్ఫర్మ్‌గా దక్కనుందని అంటున్నారు.

ఓపెనర్ రేసులో జైశ్వాల్‌తో పోలిస్తే శుభ్‌మన్ గిల్ వెనుకపడ్డాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ''గిల్ కంటే జైశ్వాల్ మెరుగ్గా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న రేసులో గిల్ కాస్త వెనకబడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గిల్ ఆడాడు. కానీ జైశ్వాల్ రాకతో రెండో టీ20లో చోటు కోల్పోయాడు. తర్వాత ఆఖరి టీ20లోనూ అవకాశం రాలేదు''
''మరోవైపు జైశ్వాల్ చివరి రెండు మ్యాచ్‌లతో పాటు సూపర్ ఓవర్‌లోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. అతడి బ్యాటింగ్ చూస్తుంటే జట్టులో స్థానం ఖరారైనట్లుగా అనిపిస్తోంది. అతడిని జట్టును తప్పించలేని పరిస్థితి ఏర్పడింది'' అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్‌కు టీమిండియా వికెట్ కీపర్ ఎవరనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదని చోప్రా పేర్కొన్నాడు. జితేశ్ శర్మకు తొలి రెండు టీ20ల్లో అవకాశం ఇస్తే.. మొదటి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడని, కానీ సెకండ్ మ్యాచ్‌లో తేలిపోయాడని అన్నాడు. మరోవైపు సంజు శాంసన్ ఆఖరి టీ20లో నిరాశపరిచాడని తెలిపాడు.