
ముంబై: తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఆసీస్ వన్డే సిరీస్ సొంతం చేసుకుంటే.. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా సేమ్ సీన్ రిపీట్ చేసింది. వన్డేల్లో భారీ స్కోర్లను ఛేదించలేక చతికిలబడ్డ చోటే.. టీ20ల్లో రికార్డు స్థాయి స్కోరును ఛేజ్ చేసి సిరీస్ ఒడిసి పట్టింది. వన్డేల్లో ఎదురైన పరాభవానికి టీ20ల్లో బదులు తీర్చుకుంది. మంగళవారం చివరి టీ20 జరగనుంది. ఆపై డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పింక్ బాల్ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి పయనం అవుతాడు.
విరాట్ కోహ్లీ సతీమణి, నటి అనుష్క శర్మ డెలివరీ తేదీ జనవరిలో ఉండటంతో ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు అతను పెటర్నీటి లీవ్స్ తీసుకున్నాడు. బీసీసీఐ కూడా పెటర్నటీ లీవ్ మంజూరు చేసింది. దాంతో తొలి టెస్ట్ అనంతరం విరాట్ స్వదేశానికి రానున్నాడు. కోహ్లీ లేకుండానే భారత్ తదుపరి మూడు టెస్ట్‌లు ఆడనుంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లీ లేని లోటును పూడ్చటం అంత సులువు కాదు. విరాట్ ఒక్కడే.. ఇద్దరు ఆటగాళ్లతో సమానం. దీంతో అతడికి సరైన ప్రత్యామ్నాయం ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయమై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయం తెలిపాడు.
ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ... 'మొదటి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ భారత్ వెళ్తాడు. అతని స్థానంలో ఎవరు ఆడుతారనేది ఇప్పుడు అసలు సమస్య. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. పృథ్వీ షా, కేఎల్ రాహుల్‌లలో ఒకరు ఆడతారు. ఇక మిడిల్ ఆర్డర్‌లో ఒకరిని బ్యాటింగ్ చేయించాలనుకున్నట్లయితే.. రాహుల్ బదులుగా శుభ్‌మన్ గిల్ ఆడితే బాగుంటుంది. విరాట్‌కు గిల్ తగిన ప్రత్నామ్నాయం. విరాట్ బదులు గిల్ మిడిలార్డర్‌లో రాణిస్తాడు' అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఓపెనర్‌గా పృథ్వీ షా ఆశించిన స్థాయిలో ఆడకపోతే.. అతడి బదులు కేఎల్ రాహుల్‌ను ఆడించొచ్చని ఆకాష్ చోప్రా తెలిపాడు. ఓపెనర్‌గా రాహుల్ సరిగ్గా సరిపోతాడన్నాడు. విరాట్ కోహ్లీకి బదులుగా రాహుల్‌ను కాకుండా శుభ్‌మన్ గిల్‌కే ఓటేయాలని సూచించాడు. ఆస్ట్రేలియా-ఏతో సిడ్నీలోని డ్రమ్‌ఓయ్న్ ఓవల్ వేదికగా జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను 247/9 వద్ద డిక్లేర్ చేసింది. షా, గిల్ ఇద్దరూ డకౌట్లయ్యారు. కెప్టెన్ రహానే సెంచరీ చేశాడు. గ్రీన్ శతకొట్టడంతో ఆసీస్ రెండో రోజు ముగిసేసరికి 39 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.