2023 ఏడాదికి టాటా బైబై చెప్పి.. 2024 సంవత్సరానికి ఘన స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది. ఈ ఏడాది అయినా తమ లక్ష్యాలను అందుకోవాలనే సంకల్పంతో ప్రతి ఏడాదిని ఘనంగా అందరూ ఆరంభిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే అనుకున్న టార్గెట్స్‌ను సాధిస్తుంటారు. అయితే టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా 2023 ఏడాది ఆరంభంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాడంట. కానీ వాటిలో కొన్ని మాత్రమే సాధించానని, మరికొన్ని అందుకోలేకపోయానని గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
ఇంతకీ తాను పొందాలనుకున్న అయిదు కోరికలు ఏంటంటే..
1. భారత్ తరపున అత్యధిక సెంచరీలు సాధించడం
2. కుటుంబాన్ని ఆనందంగా ఉంచడం
3. సాధ్యమైనంత కష్టపడటం
4. ప్రపంచకప్‌ను అందుకోవడం
5. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్‌ను సాధించడం

''సరిగ్గా సంవత్సరం క్రితం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నా. అయితే కాసేపట్లో అంతం కానున్న ఈ 2023 ఏడాదిలో ఎన్నో అనుభూతులు పొందాను. కొన్ని సరదాగా అనిపిస్తే మరికొన్నింటి నుంచి పాఠాలు నేర్చుకున్నా. ఊహించినట్లుగా 2023 ఏడాది గడవలేదు. కానీ మా లక్ష్యాలకు చాలా దగ్గరిగా వచ్చామని, సాధ్యమైనంత వరకు ప్రయత్నించామని గర్వంగా చెబుతున్నా. వచ్చే ఏడాదిలో మరో సవాళ్లు, అవకాశాలు రానున్నాయి. 2024లో మా లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామని భావిస్తున్నా. చేసే ప్రతి పనిలో మీ అందరికీ ప్రేమ, ఆనందం, శక్తి లభిస్తుందని ఆశిస్తున్నా'' అని గిల్ పేర్కొన్నాడు.
అయితే నిర్దేశించుకున్న లక్ష్యాలలో భారత్ తరపున అత్యధిక సెంచరీలు సాధించడం, ప్రపంచకప్ ను ముద్దాడటం మినహా మిగిలినవన్నీ గిల్ సాధించాడు. కాగా, అత్యధిక సెంచరీలు సాధించడం పోటీతత్వంగా బాగానే ఉందని గిల్‌కు కొందరు మద్దతు ఇస్తుంటే.. అది సెల్ఫిస్ గోల్ అంటూ మరికొందరు నెట్టింట్లో విమర్శిస్తున్నారు. 2023 ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు.
మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న గిల్... టెస్టు ఫార్మాట్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 28 పరుగులు చేశాడు. అంతేగాక టెస్టుల్లో ఏవరేజ్ స్కోరు 30 కంటే తక్కువగా 2023ని ముగించాడు. గిల్ ఆడిన గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారే 30కు పైగా పరుగులు సాధించాడు.