
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ పేస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. గిల్ బుండరీలు బాది మంచి ఊపులో ఉన్నాడు. రెండో సెషన్ పూర్తయ్యే సమయానికి రోహిత్ (11), గిల్(14) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి 9 ఓవర్లకు భారత్ స్కోర్ 26/0గా నమోదైంది.
అంతకుముందు స్టీవ్ స్మిత్ (131) శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. భారత బౌలర్లు అందరూ రాణించడంతో 105.4 ఓవర్లలో 338 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. మార్కస్ లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4), విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్స్‌లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్స్ తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ రెండు వికెట్స్.. మొహ్మద్ సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 166/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా వెంటవెంటనే వికెట్స్ కోల్పోయింది. మార్కస్ లబుషేన్, మాథ్యూ వేడ్ (13; 2 ఫోర్స్), గ్రీన్ (0: 21 బంతుల్లో), టీమ్ పైన్ (1) ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా పెవీలియన్ బాట పట్టారు. మిచెల్ స్టార్క్ ( 24; 2 ఫోర్స్, 1 సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఇక చివరలో స్టీవ్ స్మిత్ తన బ్యాట్‌ని ఝుళిపించడంతో భారీగా రన్స్ వచ్చాయి. జడేజా అద్భుతమైన త్రో వలన స్మిత్ రనౌట్‌గా వెనుదిరగడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో స్టీవ్ స్మిత్ స్థానం సంపాదించాడు. ఇది స్మిత్‌కు టీమిండియాపై ఎనిమిదో టెస్టు సెంచరీగా నమోదైంది. అంతకుముందు గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్, రికీ పాంటింగ్ మాత్రమే భారత్‌పై ఎనిమిదేసి టెస్టు శతకాలు సాధించినవారు. అయితే స్మిత్ 25 ఇన్నింగ్స్‌లలోనే 8 సెంచరీలు బాదడం విశేషం. సోబర్స్ (30), రిచర్డ్స్ (41), పాంటింగ్ (51) ఇన్నింగ్స్‌లలో 8 సెంచరీలు చేశారు.