టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్‌లో గిల్ ఎదురు లేని ఫామ్‌లో ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్ అని చెప్పొచ్చు. అంతకుముందు పెద్దగా రాణించని గిల్.. గుజరాత్ టైటాన్స్‌తో చేరిన తర్వాత అద్భుతంగా ఆడుతున్నాడు. అతని ఆటతీరు పూర్తిగా మారిపోయింది.
అంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే సమయంలో గిల్ పెద్దగా రాణించలేదు. అయితే గుజరాత్ ఫ్రాంచైజీలో కోచ్, కెప్టెన్ అతనిపై నమ్మకం ఉంచి, మద్దతుగా నిలిచారు. దీంతో అతను చెలరేగి ఆడాడు. గుజరాత్ ఆడిన తొలి సీజన్‌లోనే ఆ టీం తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా తన జీవితాన్ని మార్చేసిన ఈ అవకాశం ఎలా వచ్చిందో గిల్ వెల్లడించాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తనను తీసుకోవాలని అనుకుంటున్నట్లు అందరి కన్నా ముందు గిల్‌కు చెప్పింది మాజీ లెజెండ్ యువరాజ్ సింగ్ అంట. 'గుజరాత్ ఫ్రాంచైజీ నన్ను తీసుకోవాలని అనుకుంటుందని నాకు ముందుగా చెప్పింది యువరాజ్ సింగ్. తను చెప్పాడనే నేను జీటీకి వెళ్లా' అని గిల్ స్పష్టం చేశాడు.
'గుజరాత్ చాలా మంచి సెటప్, అక్కడ నువ్వు చాలా నేర్చుకుంటావ్ అని యువరాజ్ చెప్పాడు. అందుకే నేను ఆ ఫ్రాంచైజీకి ఓకే చెప్పా. ఎందుకంటే యువరాజ్ ఏమైనా చెప్తే.. దానికి చాలా వాల్యూ ఉంటుందని నాకు తెలుసు' అని గిల్ చెప్పుకొచ్చాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌తో చేరిన తర్వాత గిల్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అద్భుతమైన ఆటతీరుతో చెలరేగుతున్నాడు.
ఇదే ఫామ్‌ను టీమిండియాకు కూడా తీసుకొచ్చిన అతను.. ఈ ఏడాది ఆరంభంలోనే మూడు ఫార్మాట్లలో సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీ కూడా బాదాడు. అతని ఫామ్ చూసిన మాజీలు చాలా మంది గిల్‌ను ఫ్యూచర్ కెప్టెన్‌గా తయారు చేయాలని సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.