IND vs ENG: భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ కప్ టెస్ట్ సిరీస్‌లో తన అద్భుతమైన ఆటతీరుతో పలు రికార్డులను బద్ధలు కొడుతున్నాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనే 585 పరుగులు సాధించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అనేక రికార్డులను అధిగమించాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ నాలుగు రికార్డులను బద్దలు కొట్టే అవకాశాన్ని పొందాడు.
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఆటతీరును కొనసాగిస్తే.. డాన్ బ్రాడ్‌మన్ సుమారు 100 సంవత్సరాలుగా కలిగి ఉన్న నాలుగు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టే అవకాశం ఉంది.
ఆ నాలుగు రికార్డులు ఏంటంటే..
కెప్టెన్‌గా ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు: 1936-37 యాషెస్ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా 810 పరుగులు సాధించడం కెప్టెన్ ఒక టెస్ట్ సిరీస్‌లో సాధించిన అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. శుభ్‌మన్ గిల్‌కు దానిని అధిగమించడానికి ఇంకా 225 పరుగులు మాత్రమే అవసరం. ఇది డాన్ బ్రాడ్‌మన్‌కు కెప్టెన్‌గా మొదటి సిరీస్ కావడం గమనార్హం. శుభ్‌మన్ గిల్ కూడా కెప్టెన్‌గా తన మొదటి సిరీస్‌లోనే ఈ రికార్డును బద్ధలు కొట్టే అవకాశం ఉంది.

ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్: ఇది కొద్దిగా ఛాలెంజ్‌తో కూడుకున్న రికార్డు అయినప్పటికీ శుభ్‌మన్ గిల్‌కు ఇది సాధ్యమే. 1930 యాషెస్ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మన్ 974 పరుగులు సాధించి ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సాధించాడు. శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం 390 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ.. గిల్ ప్రస్తుత ఫామ్, మిగిలి ఉన్న మూడు టెస్ట్ మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఈ అజేయ రికార్డుకు ముప్పు ఏర్పడింది.
కెప్టెన్‌గా వేగంగా 1000 టెస్ట్ పరుగులు: కెప్టెన్‌గా 1000 టెస్ట్ పరుగులను కేవలం 11 ఇన్నింగ్స్‌లలో చేరుకున్న రికార్డు కూడా బ్రాడ్‌మన్ ఖాతాలో ఉంది. శుభ్‌మన్ గిల్ తదుపరి ఆరు ఇన్నింగ్స్‌లలో 415 పరుగులు సాధిస్తే ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు: శుభ్‌మన్ గిల్ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్ జట్టుకు చెందిన క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాపై ఒక సిరీస్‌లో సాధించిన 5 సెంచరీల రికార్డును శుభ్‌మన్ గిల్ బద్ధలు కొట్టే అవకాశం ఉంది. బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో గరిష్టంగా నాలుగు సెంచరీలు సాధించాడు. ఈ రికార్డును సమం చేయడానికి శుభ్‌మన్ గిల్‌కు మరో రెండు సెంచరీలు మాత్రమే అవసరం.
కోహ్లీ, గవాస్కర్ రికార్డులు కూడా గిల్ లక్ష్యం
బ్రాడ్‌మన్ ప్రపంచ రికార్డులే కాకుండా శుభ్‌మన్ గిల్ అనేక భారతీయ రికార్డులకు కూడా చేరువలో ఉన్నాడు. భారత కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ (732 పరుగులు) రికార్డును అధిగమించడానికి శుభ్‌మన్ గిల్‌కు ఇంకా 148 పరుగులు మాత్రమే అవసరం. ఇంగ్లండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు (రాహుల్ ద్రావిడ్ 602 పరుగులు) రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 18 పరుగులు మాత్రమే అవసరం. ఇంగ్లండ్‌పై ఒక సిరీస్‌లో భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు (యశస్వి జైస్వాల్ 712 పరుగులు) రికార్డును అధిగమించడానికి 127 పరుగులు మాత్రమే అవసరం. భారత కెప్టెన్‌గా ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ (655 పరుగులు) రికార్డుకు 91 పరుగులు తక్కువగా ఉన్నాడు.