
బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (7) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ కీపర్‌కు చిక్కాడు. దీంతో జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ ఓవర్‌నైట్ స్కోరు (4)కు కేవలం మూడు పరుగులే జోడించాడు.
రోహిత్ శర్మ ఆదిలోనే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ శుభ్‌మన గిల్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. చెత్త బంతులను బౌండరీలు బాదుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తున్నాడు. ఈ క్రమంలోనే 90 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన 29వ ఓవర్ మొదటి అబంటికి రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరోవైపు చేటేశ్వర్ పుజారా క్రీజులో పాతుకుపోయాడు. 61 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క బౌండరీ కూడా బాధలేదు.
ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ ఈ జోడీని విడదీయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం గిల్ (53), పుజారా (6) పరుగులతో ఉన్నారు. భారత్ 30 ఓవర్లలో 66 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 262 రన్స్ చేయాలి. సోమవారం ఛేదన ప్రారంభించిన భారత్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమి నష్టపోకుండా 4 రన్స్ చేసింది. నాలుగో రోజు ఆటకు వర్షం పలుమార్లు అడ్డుపడటంతో దాదాపు రెండు గంటల ఆట తుడిచిపెట్టుకుపోయింది.
ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్-గవాస్కర్ (2018-19) సిరీస్‌లో విజేతగా నిలిచిన భారత్ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ నెగ్గకపోతే మాత్రం ఆసీస్ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్ అందుబాటులో లేని భారత్‌తో తలపడుతోన్న ఆ జట్టు డ్రా చేసుకున్నా అది ఓటమితో సమానమే.