IND vs AFG: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్!
IND vs AFG: భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల వేటను కొనసాగిస్తున్నారు. అతి చిన్న వయస్సులోనే టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్.. ఇప్పుడు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ముల్లాన్‌పూర్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా సెంచరీతో కదం తొక్కి గిల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్-బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల రికార్డులను తిరగరాస్తూ సరికొత్త చరిత్రను సృష్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్‌తో 126 పరుగులు సాధించాడు. గిల్ టెస్ట్ కెరీర్‌లో ఇది 11వ శతకం కాగా.. కెప్టెన్‌గా 6వ సెంచరీ కావడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా తన 1000 పరుగుల మైలురాయిని కూడా శుభ్‌మన్ గిల్ అధిగమించాడు. కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు బాదిన గిల్.. భారత కెప్టెన్లలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (20), సునీల్ గవాస్కర్ (11), మహ్మద్ అజారుద్దీన్ (9), సచిన్ టెండూల్కర్ (7)ల తర్వాత ఐదో స్థానంలో నిలిచాడు.

అయితే ఈ ఇన్నింగ్స్ ద్వారా శుభ్‌మన్ గిల్ సాధించిన మరో అరుదైన రికార్డు ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు కలిగిన రెండో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు 82.8గా ఉంది. ఈ జాబితాలో క్రికెట్ పితామహుడు, ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ (101.5 సగటు) మాత్రమే శుభ్‌మన్ గిల్ కంటే ముందున్నాడు. ఈ అసాధారణ రికార్డుతో గిల్ క్రికెట్ దిగ్గజాలైన కుమార సంగక్కర (69.6), స్టీవ్ స్మిత్ (68.1), మహేల జయవర్ధనే (59.1)లను వెనక్కి నెట్టడం విశేషం.
ప్రస్తుతం కెప్టెన్‌గా 1076 పరుగులు పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్ ప్రదర్శన భారత క్రికెట్‌కు కొండంత అండగా మారింది. కెప్టెన్సీ ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా, జట్టును ముందుండి నడిపిస్తున్న తీరు గిల్ పరిణతికి అద్దం పడుతోంది. కెప్టెన్సీ కెరీర్ ప్రారంభంలోనే ప్రపంచంలోని మేటి ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని గణాంకాలను నమోదు చేయడం గిల్ బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనం. గిల్ చూపిస్తున్న స్కిల్, సహనం, పెద్ద మ్యాచ్‌లలో బాధ్యతాయుతంగా ఆడే శైలి చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications