Team India: టీమిండియాలో కీలక మార్పు జరగబోతోంది. భారత జట్టుకు కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా ఇద్దరు యువ ఆటగాళ్ల నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ భారత టెస్ట్ జట్టు నుంచి వైదొలిగిన నేపథ్యంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ కెప్టెన్‌గా మరో యువ ఆటగాడిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారత టెస్ట్ జట్టు నుంచి వైదొలిగి టెస్ట్ మ్యాచ్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి సమాచారం అందించాడు. కానీ కోహ్లీ ఇంకా అధికారికంగా తన రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్‌లో భారత్ పాల్గొననుంది. ఈ క్రమంలో భారత టెస్ట్ జట్టు రాబోయే రెండేళ్ల పాటు ఒకే కెప్టెన్ నేతృత్వంలోనే ఆడాలని భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ గట్టిగా చెబుతున్నాడు.

జస్‌ప్రీత్ బుమ్రా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ వహించే అర్హత ఉన్నప్పటికీ.. బుమ్రా గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుమ్రా ఫాస్ట్ బౌలర్ కాబట్టి సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బుమ్రాకు భారత టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయించింది. అందువల్ల భారత టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ను నియమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ సిరీస్‌లో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మే చివరి వారంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా బీసీసీఐ ప్రకటించనుంది.
ఇదిలా ఉండగా.. భారత టెస్ట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలను స్థానాలను బీసీసీఐ ఎలా భర్తీ చేయబోతోందనే ప్రశ్న తలెత్తింది. అదే సమయంలో టీమిండియా మరో తరం వైపు అడుగులు వేస్తోంది.