టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే టీమిండియాలో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో అతను పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితికి 'బీసీసీఐ అహం' కారణమని నెటిజన్లు, క్రికెట్ అభిమానులు మండిడుతున్నారు. అసలేం జరిగిదంటే..
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాలేదు. జట్టులో చోటు కోల్పోవడానికి కారణం అతను గాయం తిరగబెట్టడమే అని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఫామ్ లేని కారణంతో సెలక్టర్లు అతడిపై వేటు వేశారని తర్వాత తెలిసింది. మరోవైపు ఇదే సమయంలో గాయం కారణంతో శ్రేయస్ రంజీ క్వార్టర్ ఫైనల్‌లో పాల్గొనలేదు.

కానీ రంజీలో పాల్గొనడానికి శ్రేయస్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక అందించింది. దీంతో శ్రేయస్ కావాలనే రంజీకి డుమ్మా కొట్టాడని బీసీసీఐ కన్నెర్ర చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో శ్రేయస్ పేరును తొలగించింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య శ్రేయస్ అయ్యర్ తిరిగి రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు.
ముంబై తరఫున తమిళనాడుతో సెమీఫైనల్ ఆడాడు. విదర్భతో జరిగిన ఫైనల్‌లోనూ బరిలోకి దిగాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో 95 పరుగులు సాధించాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి సెంచరీ కోల్పోయాడు. అయితే అతని వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో ఫైనల్‌లో వరుసగా రెండు రోజులు మైదానంలోకి అడుగుపెట్టలేదు. అంతేకాదు, గాయం త్రీవత చూస్తే ఐపీఎల్ సగం మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సీజన్‌కు కూడా అతను అందుబాటులో ఉండకపోయే అవకాశాలూ ఉన్నాయి.
జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కావాలంటే శ్రేయస్ అయ్యర్‌కు ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఐపీఎల్ ప్రదర్శనే. కానీ ఇప్పుడు లీగ్‌కు దూరమయ్యే పరిస్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆటగాళ్ల గాయాలపై స్పష్టమైన అవగాహన లేకుండా బీసీసీఐ మొండి వైఖరి చూపిస్తుందని విమర్శిస్తున్నారు. గతంలో బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని ఎన్సీఏ ఇచ్చిన తప్పుడు నివేదికను గుర్తుచేస్తున్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా శ్రేయస్ గత ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడని, ఇప్పుడు బీసీసీఐ అహం కారణంగా మరోసారి లీగ్‌కు దూరమవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.