కాన్పూర్: ఐపీఎల్-10లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ లయన్స్ ఓటమిని చవిచూసింది. గ్రీన్‌పార్క్ స్టేడియంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
గుజరాత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ శతక సమాన ఇన్నింగ్స్‌తో రాణించడంతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 5 వికెట్లకు 195 పరుగులు చేసింది.

196.. పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సాంగ్వాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు వికెట్లు చేజార్చుకుంది. మూడో బంతికి శాంసన్(10) బౌల్డ్ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ వచ్చిరాగానే తాను ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీ బాదాడు. తర్వాతి బంతికి రనౌట్ కావడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది. అప్పటికి జట్టు స్కోరు 15/2. ఈ దశలో క్రీజులో ఉన్న కరుణ్ నాయర్, శ్రేయాస్ అయ్యర్ గుజరాత్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొన్నారు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు.
ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ ఔటవడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. అయినప్పటికీ శ్రేయాస్ పట్టువిడవలేదు. ఈ మధ్యలోనే అర్ధశతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నప్పటికీ ఏమాత్రం బెదరకుండా తన జోరును కొనసాగిస్తూ వచ్చాడు.
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కమిన్స్ ఫర్వాలేదనిపించాడు. చివరి ఓవర్‌లో విజయానికి ఢిల్లీ 9 పరుగులు చేయాల్సి ఉంది. థంపీ వేసిన తొలి బంతికి రెండు పరుగులు తీసిన శ్రేయాస్ తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అమిత్ మిశ్రా వరుసగా రెండు బౌండరీలు బాది రెండు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి విజయాన్ని అందించాడు. గుజరాత్ బౌలర్లలో ఫాల్క్‌నర్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. కులకర్ణి, సాంగ్వాన్, థంపి తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్‌కు గొప్ప ఆరంభమేమీ లభించలేదు. ఓపెనర్ డ్వేన్‌స్మిత్(8) తడబడినప్పటకీ మరో ఎండ్‌లో ఉన్న యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ మాత్రం కొంచెం దూకుడుగా ఆడుతూ వచ్చాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికి స్మిత్ రనౌటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రైనా(6) ఎక్కువసేపు నిలవలేదు. కమిన్స్ బౌలింగ్‌లో రైనా బౌల్డయ్యాడు. మరో ఎండ్‌లో దిల్లీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్న ఇషాన్ కిషన్ 34 పరుగులకే అమిత్ మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
6.3 ఓవర్లకు గుజరాత్ స్కోరు 56/3. ఈ దశలో క్రీజులో ఉన్న ఫించ్, దినేశ్ కార్తిక్ బాధ్యాతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వరుసగా సింగిల్స్ తీస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుండి నడపించారు.
చెప్పుకోదగ్గ స్కోరు సాధించగానే వేగంగా ఆడేందుకు ప్రయత్నించారు. బ్రాత్‌వైట్ వేసిన 17వ ఓవర్ మొదటి బంతికే దినేశ్ వెనుదిరిగాడు. కొద్దిసేపటికి ఫించ్ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు ముగుస్తున్న నేపథ్యంలో జడేజాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించిన ఫించ్.. షమీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బౌల్డయ్యాడు.
జేమ్స్ ఫాల్క్‌నర్ 14 పరుగులతో, జడేజా 13 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఆఖర్లో రాణించడంతో ఢిల్లీకి 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు. ఢిల్లీ బౌలర్లలో షమీ, కమిన్స్, అమిత్ మిశ్రా, బ్రాత్‌వైట్ తలో వికెట్ తీశారు.