'నన్ను నేను తక్కువ అంచనా వేసుకోను. ఎప్పుడూ నేనే ఛాంపియన్.' అనే ధోరణితో ఉంటాని చెబుతున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యార్. తానెప్పుడు సక్సెస్ వెనక పరిగెత్తనని, కేవలం కష్టపడి పనిచేస్తానని, విజయం దానంత అదే వస్తుందని అన్నాడు. చాలా కాలం తర్వాత ఇంగ్లాండ్ తో తొలి వన్డే కోసం.. జాతీయ జట్టుతో కలిసిన అతడు.. మ్యాచ్ కు ముందు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్ పై టీ20 సిరీస్ లో 4-1 తేడాతో విజయం సాధించి జోష్ లో ఉన్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ మూడు మ్యాచుల సిరీస్ ను సన్నాహకంగా వాడుకోవాలని చూస్తోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వన్డే సిరీస్ కు ఎంపిక అయిన శ్రేయస్ అయ్యర్.. ఈ రెండింటిలో కీలకంగా వ్యవహరిస్తాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యార్.. సిరీస్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యాడో వివరించాడు.

తక్కువ అంచనా వేసుకోను
"నేను సక్సెస్ వెనక పరిగెత్తను. కేవలం ఓ ప్లాన్ ప్రకారం కష్టపడుతూ ముందుకెళ్తాను. అదే నన్ను విజయం వైపు తీసుకెళ్తుంది. నా వరకు నేనెప్పుడు ఛాంపియనే. ఎప్పుడూ అదే ఆత్మవిశ్వాసంతో ఉంటాను. మీరు కూడా ఇలానే ఉండాలి. నాకు తెలిసి మనల్ని మన కన్నా ఎక్కువ ఇంకెవరూ సపోర్ట్ చేయరు. నేను ఓవర్ నైట్ లో సాధించిన సక్సెస్ కన్నా విజయం కోసం ప్రయాణించే దారిని ఎక్కువ ఆస్వాదిస్తాను. అదే నాకు ముఖ్యం." అని చెప్పాడు.
ఊహల్లో కాకుండా.. వర్తమానంలో ఉండటాన్ని తాను ప్రేమిస్తానని చెప్పాడు శ్రేయస్ అయ్యార్. అదే తనను నిలదొక్కుకునేలా చేస్తుందని అన్నాడు. "ఎవరైనా సరే వర్తమానంలో ఉండాలి. 2024లో నేను ఎన్నో ఛాంపియన్స్ షిప్స్ ను గెలిచినందుకు కృతజ్ఞతతో ఉన్నాను. నేను ప్రతిరోజు చేసే పనులే, నాకు మంచి ఫలితాల్ని అందించాయి. ఈ ప్రయాణం మనకెన్నో నేర్పుతుంది. అందులో కొన్నిసార్లు గెలవొచ్చు. ఇంకొన్ని సారు ఓడిపోవచ్చు. మీరు ఏదైనా దాని వెనక పరుగెత్తితే, దాన్ని కచ్చితంగా పొందుతారు. కానీ దాని వెనక ఓ ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణాన్ని ఒక్కరాత్రిలోనే సాధించలేరు. " అని పేర్కొన్నాడు.
"ప్రతీ మ్యాచ్ కోసం టీమిండియా జెర్సీ ధరించినప్పుడు ఎంతగానో ఆస్వాదిస్తాను. ప్రతీ మ్యాచ్ లో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదిగేలా.. నన్ను నేను ఎలివేట్ చేసుకునేలా ముందుకు సాగడమే నా లక్ష్యం. గడిచిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడను." అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.