T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టుతోనే కొనసాగనున్నాడు. యువ ప్లేయర్ తిలక్ వర్మ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడమే దీనికి ప్రధాన కారణం.
తిలక్ వర్మ ఎప్పుడు తిరిగి వస్తాడు?
బీసీసీఐ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం.. తిలక్ వర్మ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్నాడు. తిలక్ వర్మ శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభించాడు.పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి తిలక్ వర్మకు మరికొంత సమయం పట్టనుంది. ఫిబ్రవరి 3న ముంబైలో తిలక్ వర్మ తిరిగి భారత జట్టుతో చేరుతాడు. టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ కంటే ముందే అతను జట్టులోకి అందుబాటులోకి వస్తాడని బోర్డు స్పష్టం చేసింది.

అయ్యర్‌కు ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందా?
తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. తిలక్ వర్మ స్థానంలో జట్టు యాజమాన్యం ఇషాన్ కిషన్‌లో నంబర్ 3లో ఆడిస్తోంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో (రెండో మ్యాచ్‌లో 76 పరుగులు), మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
న్యూజిలాండ్‌తో చివరి 2 టీ20లకు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (కీపర్), రవి బిష్ణోయ్.
న్యూజిలాండ్ జట్టులో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లలో నాలుగో టీ20 మ్యాచ్ జనవరి 28న విశాఖపట్నం వేదికగా జరగనుంది. చివరి టీ20 జనవరి 31న తిరువనంతపురం వేదికగా జరగనుంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7న ముంబై వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ముందు తిలక్ వర్మ వంటి కీలక ఆటగాడు కోలుకోవడం భారత్‌కు శుభపరిణామం. అయితే ఈ లోపు శ్రేయస్ అయ్యర్ తన సత్తా చాటుకునే అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.