టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి టెస్టు జట్టులో చోటు సంపాదించడమే ఇక కష్టమే అనిపిస్తోంది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత శ్రేయస్ తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నమెంట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో ముంబై తరఫున బరిలోకి దిగిన శ్రేయస్ విఫలమయ్యాడు.
తమిళనాడుతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ రెండు పరుగులకే వెనుదిరిగాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులే చేసి నిరాశపరిచాడు. అంతేగాక శ్రేయస్ బలహీనత మరోసారి బయటపడింది. షార్ట్ పిచ్ బాల్‌కు వికెట్ సమర్పించుకుని విమర్శపాలయ్యాడు. అయితే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీలో సత్తాచాటి భారత టెస్టు జట్టులో తిరిగి చోటు సంపాదిచుకుంటాడనుకుంటే శ్రేయస్ మరోసారి నిరాశపరిచాడు.

ఇండియా-డి జట్టుకు సారథి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రేయస్ ఇండియా-సీతో జరుగుతున్న మ్యాచ్‌లో 16 బంతుల్లో తొమ్మిది పరుగులే చేశాడు. వైశాక్ విజయకుమార్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ చేతికి చిక్కాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌పై నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. టీమిండియా టెస్టు జట్టులో శ్రేయస్‌కు చోటు దక్కడం కష్టమే అని, ఈ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఏం చేయలేడని కామెంట్లు చేస్తున్నారు.
కెప్టెన్‌గా శ్రేయస్, మెంటార్‌గా గంభీర్ కాంబినేషన్‌లో కేకేఆర్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మధ్య బలమైన బంధం ఉందని, దీంతో వన్డే జట్టులో శ్రేయస్ తిరిగొచ్చాడని గతంలో అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఇదే తరహాలో టెస్టు జట్టులో కూడా శ్రేయస్ తిరిగొస్తాడని అంచనాలు నెలకొన్నాయి. కానీ శ్రేయస్ ప్రస్తుత ప్రదర్శన చూస్తే అది కష్టమే అని అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి.
ఇక అనంతపురం వేదికగా ఇండియా-డీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-సీ జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి రోజు లంచ్ సమయానికి సీ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. అక్షర పటేల్ (20 నాటౌట్; 52 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. డీ జట్టు బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, విజయ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. హిమాన్షు, మానవ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, టాస్ గెలిచిన డీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.