
హైదరాబాద్: గత కొంతకాలంగా టీమిండియాకు సమస్యగా మారిన నాలుగో స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చక్కగా సరిపోతాడని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత క్రికెట్ జట్టు చాలా అభివృద్ధి చెందింది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలవడంతో పాటు వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో సైతం ఎగబాకింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లలోనూ ఎంతో మంది యువ ఆటగాళ్లను తెరపైకి తెచ్చింది. త్వరలో ఈ సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "మీరోసారి గుర్తు చేసుకుంటే మేం శ్రేయస్ అయ్యర్‌ను 18 నెలల క్రితం ఎంపిక చేశాం. అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే, దురదృష్టవశాత్తు మళ్లీ కొనసాగించలేకపోయాం. మేం చెప్పినట్టు అతడు టీ20, వన్డేల్లో N0.4 స్పాట్ సమస్య తీర్చగలడు" అని అన్నాడు.
గత రెండేళ్ల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అయ్యర్ పరిణితి సాధించాడు. 2017, నవంబర్లో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్ ఆ తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. సపారీలతో మూడు వన్డేలు ఆడిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు.
ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ఈ మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.