ఆఫీస్‌కు ఫోన్ చేసి తిట్టడం.. ఇదెక్కడి 'ఫ్యానిజం' రా బాబు?
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ జట్ట తృటిలో వైదొలగిన సంగతి తెలిసిందే. మే 24న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ ఫలితం వచ్చిన వెంటనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. గతంలో ఆమె చేసిన ఓ పాత వీడియోను పట్టుకుని నెటిజన్లు దారుణంగా వేధించడంతో శ్రేష్ఠ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసి ట్రోలర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రికెట్ అభిమానులు తమకు నచ్చిన జట్లను సపోర్ట్ చేసే క్రమంలో ఒక్కోసారి హద్దులు దాటుతుంటారు. ప్లేయర్లపై కోపాన్ని వారి కుటుంబ సభ్యులపై చూపించడం అత్యంత విచారకరం. శ్రేష్ఠ అయ్యర్ విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో ఆమె పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్ల నేపథ్యంలో ఓ సరదా రీల్ చేశారు. అయితే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టు టోర్నీ నుంచి వైదొలగగానే కొందరు ఆ వీడియోను రీ-షేర్ చేస్తూ శ్రేష్ఠ అయ్యర్‌ను టార్గెట్ చేశారు. అంతటితో ఆగకుండా ఆమె పనిచేసే ఆఫీస్‌కు, సహోద్యోగులకు, విద్యార్థులకు కూడా ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు. విషయం పర్సనల్ లైఫ్‌ను తాకడంతో ఆమె గట్టిగా స్పందించాల్సి వచ్చింది.

ఈ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్‌పై శ్రేష్ఠ అయ్యర్ మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.."నేను గతంలో చేసిన వీడియో కేవలం ఓ సరదా జోక్ మాత్రమే. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా సొంత సోదరుడు (శ్రేయస్ అయ్యర్) కూడా క్రికెటరే కాబట్టి, నాకు ప్రతి క్రికెటర్ పట్ల ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు హద్దులు దాటి నాతో పాటు నాతో పనిచేసే అమాయక ప్రజలను, విద్యార్థులను వేధిస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేసి మానసికంగా హింసిస్తున్నారు. అలాంటి వారిని చూస్తే నాకు జాలేస్తోంది" అంటూ శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై ఎంత ద్వేషం ఉన్నా నేరుగా చూపించాలని, కానీ సంబంధం లేని వారిని ఇబ్బంది పెట్టవద్దని శ్రేష్ఠ అయ్యర్ హెచ్చరించారు. "నా తమ్ముడు గెలిచినా, ఓడిపోయినా నేను ఎప్పుడూ అతని పక్కనే ఉంటాను, అతని విజయాలను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాను" అని ఆమె స్పష్టం చేశారు. భారత క్రికెట్‌లో ఇలా ఆటగాళ్ల కుటుంబాలను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో జరిగిన వివాదం తర్వాత కూడా వారి కుటుంబాలపై సోషల్ మీడియాలో ఇలాంటి దాడులు జరిగాయి. శ్రేష్ఠ అయ్యర్ ఎదుర్కొన్న ఈ ఘటన సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన వినోదానికి, వ్యక్తిగత దాడులకు మధ్య ఉన్న గీత ఎంతగా చెరిగిపోతుందో స్పష్టం చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications