ఇటీవల జరిగిన వన్డే వరల్ట్ కప్ లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. పుష్కరకాల వన్డే కప్ కలను నెరవేరుస్తారనుకుంటే మరోసారి భారత అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే టీమిండియా టోర్నీ ఆద్యంతం గొప్పగా పోరాడింది. కానీ ఫైనల్ లో తడబడి ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ పై బీసీసీఐ ఫుల్ ఫోకస్ పెట్టింది. దాని కోసం సెలక్టర్లు, కోచ్ ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు.
టీ20 ప్రపంచకప్ నకు రోహిత్ శర్మనే కెప్టెన్ ఇప్పటికే బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాను జట్టులో ఉంటానో లేదో క్లారిటీ ఇస్తే దానికి తగ్గట్టుగా సన్నద్ధమవుతానని బీసీసీఐని రోహిత్ డైరెక్ట్ గా ప్రశ్నించాడు. దీంతో రోహిత్ పొట్టి కప్ టోర్నీకి కూడా కెప్టెన్ గా ఉంటాడని వార్తలు వచ్చాయి.

అయితే మరో వైపు టీ20 క్రికెట్ లో యువకులు ఎక్కువగా ఉంటే ఫలితాలు సానుకూలంగా వస్తాయని, దాని కోసం ప్రయోగాలు జరుగుతున్నాయని కథనాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జట్టులో తప్పక ఉండాలని అన్నాడు. జట్టుకు ఇరుసులా మారి స్కోరును నడిపించే కోహ్లి, ఆది నుంచే ప్రత్యర్థులపై దాడి చేసే రోహిత్ శర్మ జట్టులో కొనసాగాలని పేర్కొన్నాడు.
''రోహిత్, కోహ్లి జట్టులోనే ఉండాలి. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ జరిగేది వెస్టిండీస్ లో. అక్కడ పిచ్ పరిస్థితులు మారాయి. అయితే ఐసీసీ ఈవెంట్ కాబట్టి పిచ్ లు బాగుంటాయని భావించవచ్చు. బ్యాటింగ్ కు అనుకూలించవచ్చు. కానీ కరేబియన్ ప్రీమియర్ లీగ్, అక్కడి దేశవాళీ క్రికెట్ ను ఒకసారి పరిశీలించండి. బ్యాటర్లు పరుగులు సాధించడానికి కష్టపడుతున్నారు. అనుభవం ఉన్న ఆటగాళ్లు అవసరం''
''అందరూ టీ20 క్రికెట్ లో ఫ్రెష్ అప్రోచ్ ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ రోహిత్ శర్మ భారత క్రికెట్ కు నిజమైన నాయకుడు. అతడు తన శైలిని మార్చుకొని, జట్టు బాధ్యతలు మోస్తూ జట్టును నడిపిస్తున్నాడు. కెప్టెన్ గా రోహిత్ నే కొనసాగించాలి. అలాగే విరాట్ కోహ్లి అనుభవం జట్టులో తప్పక అవసరం'' అని పఠాన్ వివరించాడు.