కోల్‌కతా: ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ చేసిన వ్యాఖ్యల పైన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ ఆవేదన వ్యక్తం చేశాడు. ట్వంటీ 20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు మార్క్ నికోలస్ మాట్లాడుతూ... వెస్టిండీస్ క్రికెటర్ల పైన ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు విండీస్ ఫైనల్ చేరింది. ఈ నేపథ్యంలో విండీస్ కెప్టెన్ సామి ఘాటుగా స్పందించాడు. అయితే, సామి ఎక్కడా మార్క్ నికోలస్ పేరు ఎత్తలేదు. ఆయన పేరు ఎత్తకుండా స్పందించాడు. ఆ వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయన్నాడు.
బుర్ర లేని వాళ్లంటూ మనుషుల్ని ఎవరైనా అంటారా? జంతువులకు సైతం బుర్రలుంటాయని, తాము ఏమీ వస్తువులం కాదని, ఆ వ్యాఖ్య మమ్మల్ని ఎంతగానో బాధించిందన్నాడు. నేను ఎంతో గౌరవించే వ్యక్తి అలా అనడం చాలా ఉద్వేగాన్ని కలిగించిందన్నాడు.

నాలుగేళ్ల క్రితం మేం ప్రపంచ ఛాంపియన్లమని, అలాంటి మమ్మల్ని బుర్ర లేని వాళ్లనడం హద్దులు దాటడమేనని, అయితే ఎవరి అభిప్రాయం వాళ్లదని, మాపై మాకు మాకు నమ్మకం ఉండటం ముఖ్యమని చెప్పాడు. ప్రపంచ క్రికెట్లో తమ ఆటగాళ్లకు సరైన గౌరవం కూడా దక్కట్లేదన్నాడు.
ట్వంటీ 20ల్లో మా ప్రదర్శన చూసి డబ్బు కోసం ఆడే ఆటగాళ్లుగా మాపై ముద్ర పడిందని, చివరికి మా బోర్డు కూడా కొన్నిసార్లు అలాగే వ్యవహరిస్తుంటుందని, టోర్నీకి ముందు జీతాల విషయంలో గొడవతో చాలా కఠిన పరిస్థితి ఎదుర్కొన్నామన్నాడు. టోర్నీకి ముందు చాలా జరిగాయన్నాడు. అయితే అవన్నీ మా ఆటగాళ్లను ఒక్కటి చేశాయన్నాడు.