ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూఏఈతో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత అద్భుత విజయం సాధించగా.. మ్యాచ్ గెలుపు కంటే ఎక్కవ చర్చకు కారణమైంది అభిషేక్ శర్మ బ్యాటింగ్. ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మ.. ఆ మ్యాచ్‌లో మొదటి బంతిని సిక్సర్‌గా మలిచి సంచలనం సృష్టించాడు. కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటైనప్పటికీ, టీమిండియా 27 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది. అయితే భారత జట్టు దూకుడు చూసి పాకిస్తాన్‌లో ఇప్పటికే ఆందోళన మొదలైంది.
పాకిస్థాన్ ఆటగాళ్లపై సెటైర్లు
పాకిస్తాన్‌లోని పలు టీవీ షోలలో మాజీ క్రికెటర్లు అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై, టీమిండియా దూకుడుపై జోకులు వేస్తున్నారు. ఒక టీవీ షోలో యాంకర్ ఏకంగా పాకిస్తాన్ ఆటగాళ్లను ఉద్దేశించి "టీమిండియా అంటే భయపడుతున్నారా?" అని ప్రశ్నించారు. మరో షోలో టీమిండియా దూకుడుపై చర్చ జరుగుతుండగా.. అభిషేక్ శర్మ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్..అభిషేక్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ, అతను ఇంత దూకుడుగా ఎందుకు ఆడుతున్నాడో వివరించారు.

షోయబ్ మాలిక్ ఏమన్నారంటే..
షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. " ఒక ఆటగాడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభిషేక్ శర్మ 16 మ్యాచ్‌లలో 33.43 సగటుతో 533 పరుగులు చేశాడు. అభిషేక్ స్ట్రైక్ రేట్ 193.84. ఇది ఎలా సాధ్యమైంది? మన ఆటగాళ్లు ఇలా ఆడలేరని కాదు. వారు కూడా దూకుడుగా ఆడగలరు. కానీ ప్రతిభ ఉన్న ఆటగాడికి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అప్పుడే వారిలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది. రెండు మ్యాచ్‌ల తర్వాత మూడో మ్యాచ్‌లో ఉంటాడో లేదో తెలియని పరిస్థితిలో ఉంటే.. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఆశించగలం?" అని ప్రశ్నించారు.
వ్యవస్థలో మార్పులు కావాలి..
"మన వ్యవస్థ మన యువ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడం లేదు. పాత ఆటగాళ్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా వారిని సిరీస్‌ల నుంచి తొలగిస్తారు. యువకులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మీలో ఎంత ప్రతిభ ఉన్నా, మీ మానసిక స్థితి 'నన్ను జట్టు నుంచి తీసేస్తారేమో' అని ఆలోచిస్తుంటే, మీరు ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడలేరు. మన వ్యవస్థలో చాలా మార్పులు రావాలి" అని షోయబ్ మాలిక్ సూచించారు.