RR VS RCB: ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి జట్లు నిరాశపరుస్తుంటే.. అంచనాలు లేని జట్లేమో భారీ స్కోర్లు చేస్తూ థ్రిల్లింగ్ మ్యాచులను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడీ రిచ్ క్యాష్ లీగ్‌లో భాగంగా మరో కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో ఈ కీలక పోరును నిర్వహించారు.
సందడి సందడిగా..
ఈ మ్యాచు కోసం రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ జైపుర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియానికి భారీ స్థాయిలో అభిమానులు చేరుకున్నారు. గంటల పాటు క్యూలో నిలబడి మరి టికెట్లు కొనుగోలు చేసి మ్యాచ్ చూసేందుకు తరలివచ్చారు. అయితే మ్యాచ్ ఏదైనా.. అది జరిగే స్టేడియం చుట్టుపక్కల అభిమానులతో పాటు చిరు వ్యాపారస్తులతో సందడి వాతావరణం నెలకొంటుంది. జెర్సీలు సహా ఇతరత్ర తినుబండారాలు కూడా విక్రయిస్తుంటారు.

ఏ జెర్సీ ఎంతకు?
అలా ఇప్పుడు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతున్న జైపుర్ స్టేడియం దగ్గర.. రోడ్డు మీద ఐపీఎల్ జట్ల జెర్సీలను అమ్మారు. అక్కడ రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, సన్ రైజర్స్, సీఎస్కే జెర్సీలు, టోపీలు ఉన్నాయి. దీంతో వారి దగ్గరికి వెళ్లి.. ఏ జెర్సీ ఎంత ధర? ఏ జట్టు జెర్సీలు ఎక్కువగా విక్రయించారు? అని అడగగా.. ఆసక్తికర విషయం తెలిసింది.
సీఎస్కేనే ఎక్కువ..
జెర్సీలను విక్రయించే మహిళా మాట్లాడుతూ.. "ఆర్సీబీ, విరాట్ కోహ్లీ జెర్సీలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఒక్కో జెర్సీ 150 నుంచి 200 వరకు అమ్ముతున్నాం. రాజస్థాన్ జట్టు ధర కూడా అంతే. మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ అయినా.. అన్నింటికన్నా ఎక్కువగా సీఎస్కే జెర్సీలే అమ్ముడుపోయాయి. అందరూ సీఎస్కేనే ఎక్కువ కొన్నారు. స్టాక్ కూడా అయిపోయింది." అని చెప్పారు.