టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతడు గాయంతో భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 సిరీస్‌లో సూర్యకు చీలమండలానికి గాయమైంది. ప్రస్తుతం సూర్య కోలుకుంటున్నాడు.
అయితే హెర్నియా సమస్యను తొలగించుకునేందుకు సూర్యకుమార్ సర్జరీ చేయించుకోనున్నాడు. దాని కోసం ఇప్పటికే బీసీసీఐ అధికారులు వైద్య నిపుణులను కూడా సంప్రదించారు. మరికొన్ని రోజుల్లో విదేశాల్లో సూర్యకుమార్ శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉంది. అయితే సర్జరీ అనంతరం సూర్య కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వారాల సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లకు సూర్యకుమార్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ మొత్తానికి కూడా సూర్య దూరమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే ఫ్రాంచైజీ నిర్ణయాలతో ముంబయి ఇండియన్స్ జట్టులో విభేదాలు మొదలయ్యాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాడు. ఇటీవల రోహిత్‌ను కాదని హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో సూర్య రోహిత్‌కు మద్దతుగా హార్ట్ బ్రేక్ సింబల్ పోస్ట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య వచ్చే సీజన్‌కు దూరమైతే ముంబయికి ప్రతికూలంగా మారుతుంది.
అయితే సూర్య ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు మహ్మద్ షమి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడని చెప్పారు. ''షమి ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించలేదు. అతడు ఎన్‌సీఏకి వెళ్లి ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండటం అనుమానమే''
''మరోవైపు సూర్యకుమార్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. సూర్య హెర్నియా ఆపరేషన్ తర్వాత తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వారాలు పట్టవచ్చు. ఐపీఎల్ వరకు ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాం'' అని బీసీసీఐ అధికారి తెలిపాడు. కాగా, స్వదేశంలో భారత్ జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్, జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.