పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రేమ కోసం దేశాన్ని విడిచి, అవమానాలు ఎదుర్కొని వచ్చిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఎలా మోసం చేయాలనిపించిందని మాలిక్‌ను ఉద్దేశిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికీ మాలిక్‌కు రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహమాడాడు. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ మారాయి.
అయితే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు రెండేళ్ల క్రితమే వార్తలు మొదలయ్యాయి. విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆ తర్వాత ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయితే తాజాగా సానియా మీర్జా చేసిన పోస్ట్‌తో మరోసారి విడిపోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 'పెళ్లి కష్టం, విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి' అంటూ సానియా ఓ కొటేషన్‌ను తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

దీంతో వారిద్దరి విడిపోతున్నట్లు వార్తలు మరోసారి మొదలయ్యాయి. అంతేగాక సానియా తన భర్త ఫోటో లేకుండానే ఫొటోల్ని ఇటీవల షేర్ చేస్తోంది. మరోవైపు సనా జావేద్‌కు ఇది రెండో వివాహం. పాకిస్తాన్ కు చెందిన ఈ ప్రముఖ నటీ వయసు 28 ఏళ్లు. సనా అనేక టీవీ షోల్లో కనిపించింది. 'ఏ ముష్త్-ఎ-ఖాన్', 'డంక్' అనే షోలతో ఆమెకు గుర్తింపు లభించింది. అయితే 2020లో ఉమైర్ జస్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. మరోవైపు సనాతో మాలిక్ డేటింగ్ ఉన్నట్లు గతంలో చాలా సార్లు కథనాలు వచ్చాయి. గతేడాది సనా పుట్టినరోజు సందర్భంగా షోయబ్ మాలిక్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పినప్పటి నుంచి వార్తలు మొదలయ్యాయి.
అయితే సానియా, మాలిక్ వివాహం అంత ఈజీగా జరగలేదు. మాలిక్‌ను పెళ్లి చేసుకోవాలని సానియా భావిస్తుందని తెలియడంతో ఆమెను కొంతమంది దారుణంగా విమర్శించారు. శత్రుదేశంగా భావించే పాక్‌కు కోడలుగా వెళ్లకూడదని అవమానించారు. కానీ దేశాన్ని దాటి మాలిక్ కోసం సానియా కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వారు పాకిస్థాన్, దుబాయ్‌లో నివసించారు. అయిదేళ్ల క్రితం వారికి బాబు కూడా జన్మించాడు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు పెరిగినట్టు తెలిసింది.
అయితే విడిపోవడం, మరో పెళ్లి చేసుకోవడం వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ నెటిజన్లు షోయబ్ మాలిక్‌ను తప్పుపడుతున్నారు. అంతేగాక అతడు మూడో పెళ్లి చేసుకోవడం తీవ్రంగా విమర్శిస్తున్నారు. 'మాలిక్‌కు మూడో పెళ్లి చేసుకోవడానికి సిగ్గుండాలి. తన కోసం దేశాన్ని విడిచిన సానియా మీర్జాను ఎలా వదులుకోవాలనిపించింది. తమ కళ్లను నమ్మలేకపోతున్నాం' అంటూ నెటిజన్లు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.