
హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా నవంబరు 21న టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సరిగ్గా అదే రోజున షార్జా వేదికగా టీ10 లీగ్ ప్రారంభం కానుంది. సీనియర్ క్రికెటర్లు ఆడుతున్న నేపథ్యంలో లీగ్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. పోటీ మొత్తంలో 8జట్లు ఆడనున్న నేపథ్యంలో రెండు గ్రూపులుగా 11రోజులపాటు టోర్నీ జరగనుంది. డిసెంబర్ 2న జరిగే ఫైనల్‌తో లీగ్ ముగుస్తుంది.
ఈ షార్ట్ ఫార్మాట్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లుగా మాలిక్ ట్విటర్ ద్వారా అనూహ్య ప్రకటన చేశాడు. ఈ లీగ్‌లో పంజాబీ లెజెండ్స్‌కు కెప్టెన్సీ వహించాల్సి ఉన్న పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తాజాగా టోర్నీ నుంచి వైదొలగడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పోస్టులో లీగ్ నుంచి వైదొలుగుతున్నందుకు కారణాన్ని వివరించాడు.
'ఇది కఠినమైన నిర్ణయమైన తప్పడం లేదు. కుటుంబంతో గడపాలనే కారణంతోనే టీ10 లీగ్ నుంచి తప్పుకుంటున్నా. నా భార్య సానియా మాత్రం ఈ టోర్నీలో ఆడాలని కోరుకుంటోంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో భార్య, కుమారుడికే సమయం కేటాయించాలనుకుంటున్నాను. ప్రాధాన్యమివ్వదలచుకుంటే వారి కంటే ఏదీ ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా' అంటూ మాలిక్ ట్వీట్ చేశాడు.
ఈ ఏడాది అక్టోబర్ 29న సానియా మీర్జా మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ నుంచి జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్, మునాఫ్ పటేల్, బద్రినాథ్, ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ తంబే, క్రిస్ గేల్, మలింగ, షాహిద్ అఫ్రిది, బ్రెండన్ మెక్‌కలమ్, షేన్ వాట్సన్, డారెన్ సామి, కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలు ఈ టోర్నీలో ఆడనున్నారు.