న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత టెన్నిస్ తార సానియా మీర్జా డ్యాన్స్ చేసిన అంశంపై భారత క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. దానికి సానియా భర్త షోయబ్ మాలిక్ ప్రతిగా రీట్వీట్ చేశాడు.
సానియా, షోయబ్ డ్యాన్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. దీని పైన యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. వీరిద్దరు ఔట్ స్టాండింగ్ ఆటగాళ్లని, కానీ డ్యాన్స్ మాత్రం బాగా లేదని చెప్పాడు.
యువీ ట్వీట్ పైన షోయబ్ మాలిక్ స్పందించాడు. మైదానంలో చూసుకుందాం రా అని రీట్వీట్ చేశాడు. దీనిపై ఇంటర్నెట్లో విపరీతమైన స్పందన వస్తోంది.

కాగా, పాకిస్ధాన్ క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డ్యాన్స్ చేసింది. ఇటీవల శ్రీలంకతో ఆ దేశ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్ధాన్ జట్టు విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన సానియా మీర్జా సంతోషంతో తన భర్తతో కలిసి విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది.
భర్త షోయబ్ మాలిక్‌తోపాటు పాక్ ఆటగాళ్లతో కలిసి 'అభీ తో పార్టీ షురూ హుయీ హై (పార్టీ ఇప్పుడే మొదలైంది)' అనే బాలీవుడ్ పాటకు ''డబ్ స్మాష్' డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వీడియోను షోయబ్ మాలిక్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు.