IND vs PAK: ఆసియా కప్ 2025లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై ప్రస్తుతం రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ను భారత్‌లో బహిష్కరించాలన పిలుపునిస్తున్నారంటూ కొన్ని మీడియా నివేదికలు వచ్చాయి. ఇటీవల జరిగిన పహల్గాం ఘటన కారణంగా అభిమానులలో ఉత్సాహం తగ్గిందని, అందువల్ల టికెట్లు అమ్ముడుపోవడం లేదని లేదని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ ప్రచారంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ గట్టిగా స్పందించారు. ఈ వార్తలను ఆయన ముక్తకంఠంతో ఖండించారు. ఈ మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోలేదనేది కేవలం బయట మాట మాత్రమేనని.. వాస్తవానికి అన్ని టికెట్లు అమ్ముడైపోయాయని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం తర్వాత మొదటిసారిగా మనం భారత్‌తో తలపడుతున్నామని.. ఇలాంటి చారిత్రాత్మక మ్యాచ్ హౌస్‌ఫుల్ కాకుండా ఉండటం అసాధ్యమని ఆయన అన్నారు. ఇది కేవలం మీడియా సృష్టించిన ఊహాగానమేనని షోయబ్ అక్తర్ కొట్టిపారేశారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇబ్బందికరమైన వాతావరణం
షోయబ్ అక్తర్ స్టేడియం హౌస్‌ఫుల్ అవుతుందని చెబుతున్నప్పటికీ, ఆసియా కప్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత్-పాకిస్తాన్ కెప్టెన్ల మధ్య వాతావరణం చాలా ఇబ్బందికరంగా కనిపించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కరచాలనం చేసుకున్నప్పటికీ, ఇద్దరి మధ్య దూరం స్పష్టంగా కనిపించింది. ఇది ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను సూచిస్తుంది. అయితే, మైదానంలో ఎల్లప్పుడూ ఒక తీవ్రమైన వాతావరణం ఉంటుందనే సంగతి తెలిసిందే.
తొలి మ్యాచ్‌లలో రెండు జట్ల విజయం
ఈ మెగా మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. భారత్ తమ మొదటి మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఈజీగా విజయం సాధించింది. మరోవైపు, పాకిస్తాన్ కూడా తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించి సత్తా చాటింది. ఇప్పుడు ఈ ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో ఏ జట్టు మెరుగైన ప్రదర్శనతో విజయం సాధించి, తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుందో చూడాలి.