హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లను తమ బంతులతో బెంబేలెత్తించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, వసీం అక్రమ్‌ల జోడీ ఒకటి. తమ హాస్య చతురతతో నవ్వులు పూయించారు. పాకిస్థాన్‌కు చెందిన 'జియో ఖేలియో పాకిస్తాన్' అనే టెలివిజన్ గేమ్ షో కోసం ఈ మాజీ బౌలర్లు ఓ టెలివిజయన్ యాడ్‌లో నటించారు.
ఈ టీవీ షోలో షోయబ్ హోస్ట్‌గా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన 50 సెకన్ల ప్రోమోను అక్తర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అక్రమ్ భాయ్ అద్భుతంగా నటించాడంటూ కితాబు కూడా ఇచ్చాడు. ఈ యాడ్ చూసిన నెటిజన్లు ఈ ఇద్దరిపై ప్రశంసలు కురిపించారు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే?:
వడ్డీ వ్యాపారి వసీం అక్రమ్ దగ్గర అప్పు తీసుకున్న అక్తర్ ఉదయం ఓ కోడి పెట్టతో అతని దగ్గరకు వెళ్తాడు. నాలుగు లక్షల అప్పుకు గాను కోడి ఇస్తావా అంటూ అక్రమ్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కానీ, అది మామూలు కోడి కాదని, బంగారు గుడ్లు పెడుతుందని చెబుతాడు.
అసలది కోడి పెట్ట కాదు పుంజు అని తెలుసుకున్న అక్రమ్ ఆగ్రహంగా అక్తర్ మెడలు పట్టుకుంటాడు. అప్పుడు.. షోయబ్ తనకు మరొక్క అవకాశం ఇవ్వమంటూ గేమ్‌షో టిక్కెట్లు చూపిస్తాడు. దాన్ని తీసుకున్న అక్రమ్ షోలో ఎన్నో బహుమతులు గెలుచుకుంటాడు. ఇంకా ఏం కావాలని షోలో వ్యాఖ్యాతగా ఉన్న అక్తర్ ప్రశ్నించగా... బంగారు గుడ్లు పెట్టే కోడి కావాలని బదులిస్తాడు. దాంతో, అక్తర్ ఆశ్చర్యపోవడంతో ప్రోమో ముగుస్తుంది.