
2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌ను భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్.. ఫైనల్ చేరేందుకు సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. ఇదే విషయాన్ని అక్తర్ గుర్తుచేశాడు. 'నాకు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ కావాలి. అది ముంబైలో జరిగినా, అహ్మదాబాద్‌లో జరిగినా ఎక్కడైనా పర్లేదు. 2011 ఓటమికి పగ తీర్చుకోవాలి' అని అక్తర్ అన్నాడు. అలాగే ప్రస్తుతం బీసీసీఐ, పీసీబీ మధ్య గొడవకు కారణమైన ఆసియా కప్ 2023 గురించి కూడా3 మాట్లాడాడు. ఈ టోర్నీ మొత్తం పాక్‌లోనే జరగాలని పీసీబీ పట్టుబడుతుండగా.. భారత జట్టును పాకిస్తాన్ పంపడం కుదరదని బీసీసీఐ అంటోంది.
అయితే ఈ విషయంపై అంత ఫోకస్ అక్కర్లేదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. 'ఇదంతా చెత్త వాగుడే. ఈ విషయంలో బీసీసీఐ, పీసీబీ రెండూ ఏం చెయ్యలేవు. భారత ప్రభుత్వాన్ని అడగకుండా బీసీసీఐ సొత నిర్ణయాలు తీసుకోలేదు. పాక్ బోర్డు కూడా అంతే. కానీ అందరూ భారత్, పాకిస్తాన్ సంబంధాలపై అభిప్రాయాలు చెప్పడానికి వచ్చేస్తారు. రెండు దేశాల్లో ఉన్న మాజీ ఆటగాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. ఈ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు చేయకండి. మోదీ గవర్నమెంట్ ఒప్పుకుంటే.. పాకిస్తాన్ రావడానికి బీసీసీఐకి అడ్డేం ఉంటుంది?' అని ప్రశ్నించాడు.