ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన తర్వాత నెలకొన్న షేక్‌హ్యాండ్ వివాదంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేయడంతో పాటు క్రికెట్‌ను రాజకీయాలకు ముడిపెట్టవద్దని భారత ఆటగాళ్లను కోరారు.
నాకు మాటలు రావడం లేదు-అక్తర్
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య షేక్ హ్యాండ్ జరగలేదు. ఈ ఘటనపై షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. "నాకు మాటలు రావడం లేదు. ఇది హృదయాన్ని బాధించింది. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే. దీన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దు. గొడవలు ఎక్కడైనా జరుగుతాయి. కానీ వాటిని మర్చిపోయి ముందుకు సాగాలి. ఇది క్రికెట్ ఆట. చేతులు కలపండి, మీ గౌరవాన్ని చూపించండి" అని షోయబ్ అక్తర్ అన్నారు.

అంతే కాకుండా.. మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ వేడుకను బహిష్కరించిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నిర్ణయాన్ని అక్తర్ సమర్థించారు. "సల్మాన్ అలీ ఆఘా బాగా చేశాడు, అతను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌కు వెళ్ళలేదు, గుడ్" అని అక్తర్ పేర్కొన్నారు.
మ్యాచ్ అనంతరం ఏం జరిగిందంటే?
భారత్ గెలిచిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. పాకిస్థాన్ ఆటగాళ్లు కరచాలనం కోసం కొంతసేపు మైదానంలో ఎదురుచూసినప్పటికీ, ఏ భారత ఆటగాడూ ముందుకు రాలేదు. ఈ ఘటన సమయంలో, భారత సహాయక సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసివేయడం కనిపించింది.