న్యూఢిల్లీ: గత 20 ఏళ్లుగా చెక్కుచెదరకుండా తన పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తే చూడాలని ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఆ రికార్డును భారత యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అధిగమిస్తే మరింత సంతోషిస్తానని చెప్పాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఉమ్రాన్ మాలిక్ అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తనదైన పేస్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో గంటకు 150 కి.మీ పైగా స్పీడ్‌తో మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సీజన్లో ఫాస్టెస్ట్ డెలివరీ ( గంటకు 157 కిలోమీటర్లు) వేసిన రికార్డు కూడా నమోదు చేశాడు. ఈ క్రమంలోనే మాలిక్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్.. మాలిక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన వేసిన ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును మాలిక్ బద్దలు కొడితే చూడాలన్న తన కోరికను బయటపెట్టాడు. 'షోయబ్ మాలిక్ చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. నేను అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన డెలివరీ వేసి 20 సంవత్సరాలైంది, కానీ ఎవరూ నా రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. అయితే నా రికార్డును ఎవరైనా బద్దలు కొడితే చూడాలని ఉంది. ఒక వేళ ఉమ్రాన్ నా రికార్డును బ్రేక్ చేస్తే సంతోషిస్తాను.
కానీ అతను ఈ ప్రక్రియలో గాయపడకుండా చూసుకోవాలి. అతను ఎటువంటి గాయాల బారిన పడకుండా తన కెరీర్‌ను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతన్ని నేను చూడాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉమ్రాన్ మాత్రం ఆ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం అద్భుతం" అని అక్తర్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన రికార్డు అక్తర్ పేరున ఉంది. 2003 ప్రపంచకప్‌లో అక్తర్ గంటకు 161.3 కి.మీ వేగంతో వేశాడు. న్యూజిలాండ్ పర్యటనలో అక్తర్ ఈ ఫీట్ సాధించాడు.