హర్భజన్‌ని కొట్టేందుకు హోటల్ గదికెళ్లా.. కానీ.. :అక్తర్

కరాచీ: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో గొడవపడేందుకు 2010 ఆసియా కప్ సమయంలో అతని గదికెళ్లానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. 2010 ఆసియాకప్ సందర్భంగా శ్రీలంకలోని డంబుల్లాలో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్, అక్తర్ గొడవపడ్డారు. 47వ ఓవర్ బౌలింగ్ చేసిన అక్తర్.. హర్భజన్‌పై పంజాబీలో నోరుజారాడు. దాంతో భజ్జీ కూడా అదే రీతిలో ఘాటుగా బదులివ్వడమే కాకుండా.. సిక్సర్ కొట్టి గుణపాఠం చెప్పాడు.

47వ ఓవర్లో గొడవ:
హర్భజన్ సింగ్‌తో ఆ మ్యాచ్‌లో గొడవ గురించి తాజాగా హలో యాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడాడు. 47వ ఓవర్ తర్వాత మైదానంలో ఉన్న అక్తర్.. నిన్ను రూంకి వచ్చి కొడతానని భజ్జీకి వార్నింగ్ ఇచ్చాడట. ముందుగా రూంలోకి అయితే రా.. ఎవరిని ఎవరు కొడతారో? చూసుకుందామని హర్భజన్ సవాల్ విసిరాడట. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత హర్భజన్ ఉండే హోటల్ రూంలోకి అక్తర్ వెళితే.. ఆ సమయంలో భజ్జీ అక్కడ లేడట. దీంతో గొడవ జరగలేదని పాకిస్థాన్ మాజీ పేసర్ చెప్పాడు.

భజ్జీని కొట్టేందుకు హోటల్ రూంకి వెళ్లా:
షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'హర్భజన్ మాతో కలిసి తింటాడు, లాహోర్‌లో మాతో కలిసి తిరుగుతాడు. అతను పంజాబీ కావడంతో మా మధ్య ఒకే తరహా సాంప్రదాయాలు ఉంటాయి. అయినా, అతను మాతో గొడవపడతాడు. ఆ రోజు మ్యాచ్ అయ్యాక అతని గదికెళ్లి గొడవపడాలనుకున్నా. భజ్జీని కొట్టేందుకు హోటల్ రూంకి వెళ్లాను. బహుశా నేను అతని రూంకి వస్తానని తెలుసేమో? భజ్జీ అక్కడ లేడు. దాంతో నేను వెనక్కి వచ్చేశా. అయితే మరుసటి రోజు క్షమాపణ చెప్పాడు' అని అక్తర్ వివరించాడు.

రెండు సిక్సులు బాదిన భజ్జీ:
అక్తర్ వేసిన 47వ ఓవర్‌లో తొలుత హర్భజన్ లాంగాఫ్ మీదుగా ఓ భారీ సిక్స్ కొట్టాడు. అక్తర్‌కు కోపమొచ్చి.. భజ్జీని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేశాడు. అలా ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. అయితే మొహమ్మద్ అమీర్ వేసిన చివరి ఓవర్‌లో భారత్ విజయానికి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమైన స్థితిలో భజ్జీ మరో సిక్స్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.3 ఓవర్లలో 267 పరుగులకి అలౌట్ అయింది. లక్ష్యాన్ని టీమిండియా 49.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్భజన్ (15 నాటౌట్: 11 బంతుల్లో 2x6) రెండు సిక్సర్లు బాదాడు.

నిజంగా భయపడ్డా:
ఇదే విషయాన్ని హర్భజన్ కూడా ఓసందర్భంలో ఒప్పుకున్నాడు. 'అక్తర్ నా గదికొచ్చి కొడతానని చెప్పాడు. దాంతో నేను కూడా.. సరే, రా! ఎవరు ఎవర్ని కొడతారో చూసుకుందాం అని బదులిచ్చా. కానీ ఆ సమయంలో నేను నిజంగా భయపడ్డా. ఎందుకంటే.. అక్తర్ శరీర సౌష్టవం బలంగా ఉంటుంది' అని అన్నాడు. ఈ విషయాన్ని సురేశ్ రైనా సైతం ఇటీవల ఇర్ఫాన్ పఠాన్‌తో పంచుకున్నాడు. 'భజ్జీ ఒక ఫైటర్. తనతో ఆడేటప్పుడు ఒకసారి అక్తర్‌తో గొడవపడ్డాడు. చివరికి భజ్జీ సిక్స్ కొట్టి గెలిపించాడు' అని తెలిపాడు. ఆ సమయంలో రైనా నాన్‌స్ట్రైకర్‌గా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications