హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఫార్మాట్ ఏదైనా సరే చెలరేగిపోయే కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ... పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
'నేనెప్పుడూ అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. అతడు బలంగా విసిరిన బంతి బ్యాట్స్‌మెన్ శరీరాన్ని తాకుతుందేమో అనిపిస్తుంది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చాలా ప్రమాదకారి. షోయబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉండటం ఉత్తమం' అని షోయబ్‌ని ఉద్దేశించి కోహ్లీ చెప్పాడు.
అయితే విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై షోయబ్ అక్తర్ స్పందించాడు. 'విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్‌మెన్. అతడికి బౌలింగ్ వేయడం కచ్చితంగా గొప్ప పోటీ' అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు.
2010 ఆసియా కప్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ బౌలింగ్ స్పెల్ అయ్యాక విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. 27 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లీ... పాక్ బౌలర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం కోహ్లీకి రాకపోవడం విశేషం.