కోల్‌కతా: టీ20 ప్రపంచ కప్ టోర్నీ భాగంగా శనివారం జరిగిన మ్యాచులో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే, తమ దేశ ఓటమి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ను అసహనానికి గురి చేసినట్టుంది.
అందుకే మ్యాచ అనంతరం జరిగిన ఓ టీవీ లైవ్ షోలో అక్తర్.. యాంకర్‌పై ఆగ్రహం ప్రదర్శించాడు. యాంకర్ తనను చూసి నవ్వడం అక్తర్‌కు కోపం తెప్పించింది. వెంటనే ఎందుకునవ్వుతున్నావంటూ అతణ్ణి ప్రశ్నించాడు.
అయితే టీవీలో ప్రసారం అవుతున్న 'మౌకా.. మౌకా' యాడ్‌ను ప్రస్తావించి అక్తర్‌ను శాంతపరిచేందుకు యాంకర్ ప్రయత్నించాడు. కానీ, ముఖం అదోలా పెట్టిన అక్తర్ 'నేనిక్కడికి వచ్చింది మ్యాచ్ విశ్లేషణకే. దయచేసి దానికే పరిమితమవ్వండి. ఇలాంటి జోకులొద్దు' అని వ్యాఖ్యానించాడు.
దీంతో మరో అతిథి.. కపిల్ దేవ్ కలుగజేసుకొని అక్తర్‌ను శాంతింప జేసే ప్రయత్నం చేశాడు. కాగా, మౌకా మౌకా ప్రకటనలో ఓ పాకిస్థాన్ అభిమాని.. జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని ఈసారైనా మ్యాచ్ గెలవాలని ప్రాధేయపడతాడు. భారత ఆటగాళ్లకు సిక్సులు ఎలా కొట్టాలో చెప్పాలని కోరతాడు. ఈసారైనా తమ పటాకులు పేలతాయా? అంటూ పటాకులను దగ్గరికి తీసుకుంటాడు.