
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రవేశపెట్టిన టెస్టు జెర్సీల ఆలోచనతో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిరాశ చెందాడు. క్రికెటర్ల టెస్టు జెర్సీలపై ముద్రించిన నంబర్లు, పేర్లు భయంకరంగా ఉన్నాయని, ఐసీసీ తన నిర్ణయాన్ని ఎనక్కి తీసుకోవాలని అక్తర్ డిమాండ్ చేశాడు. యాషెస్ సిరీస్ నుంచి క్రికెటర్ల టెస్టు జెర్సీలపై నంబర్లు, పేర్లను ఐసీసీ ప్రవేశపెట్టింది. దీంతో ఐసీసీ పలు విమర్శలను ఎదుర్కొంటోంది.
ఇప్పటికే ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, బ్రెట్ లీ.. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధ్వజమెత్తారు. ఐసీసీ పనికిమాలిన నిర్ణయం తీసుకుంది అంటూ తమ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అక్తర్.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఐసీసీపై మండిపడ్డాడు.
'క్రికెటర్ల టెస్టు మ్యాచ్ జెర్సీలపై పేర్లు, నంబర్లు భయంకరంగా ఉన్నాయి. ఐసీసీది సరైన నిర్ణయం కాదు. సాంప్రదాయ టెస్టు క్రికెట్ స్ఫూర్తికి ఇది విరుద్ధం. టెస్టు క్రికెట్‌ను మరింత మసకబారుస్తున్నారు. ఐసీసీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని' అని అక్తర్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు.
'నేను క్షమాపణను తిరిగి తీసుకుంటాను. టెస్టు జెర్సీలపై నంబర్లు, పేర్లు చెత్తగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సిరీస్‌ను ఆస్వాదించండి' అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నారు. 'స్వెటర్లపై కూడా సంఖ్యలు ఉండాలా?' అని అశ్విన్ ప్రశ్నించాడు. 'టెస్టు జెర్సీలపై నంబర్లు, పేర్లకు నేను వ్యతిరేకంగా ఉన్నాను. ఐసీసీ సాధారణంగా క్రికెట్‌లో చేసిన మార్పులను నేను ఇష్టపడుతున్నా. కానీ ఈ విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నాను' అని బ్రెట్ లీ అన్నాడు.
గతేడాది జరిగిన ఐసీసీ సమావేశంలో టెస్టు జెర్సీలపై నంబర్లు, పేర్లకు ఆమోద ముద్ర వేశారు. ఈ నిర్ణయాన్ని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నుంచి కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు పేర్లు, నంబర్లు ముద్రించిన జెర్సీలతో ఆడుతున్నారు. దీనిపై విమర్శలు దాడి కొనసాగుతోంది.