హైదరాబాద్: పాకిస్థాన్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు సిరిస్‌కు ఆహ్వానించకపోవడమే మంచిదని ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో వైట్ వాష్ అయిన పాకిస్థాన్ జట్టుపై ఛాపెల్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టుకు ఆడటం రాకపోతే ఇంట్లో కూర్చుంటే మంచిదని వ్యాఖ్యానించాడు.
రాబోయే రోజుల్లో పాకిస్థాన్ జట్టును టెస్టు సిరిస్‌కు ఆహ్వానించకపోవడమే మంచిదని చాపెల్ సూచించాడు. దీంతో చాపెల్ వ్యాఖ్యలపై అక్తర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. పాకిస్థాన్ జట్టు కామెడీ చేయడానికి ఆస్ట్రేలియా రాలేదని, కాంపిటీటివ్ గేమ్ ఆడేందుకు ఆసీస్ వచ్చారని తెలుసుకోవాలని చాపెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన మెరుగ్గా లేదన్న మాట వాస్తవమేనని, ఆ విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. అయితే క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ నెగ్గిందా? అలాగని వాళ్లు ఇంట్లో కూర్చుంటున్నారా? అని అక్తర్ ధీటుగా ప్రశ్నించాడు.
పాకిస్థాన్ జట్టు ఆటతీరు మెరుగు పరచుకునే వరకూ వేచి చూడండి. అప్పటివరకు ఓపికపట్టకుండా పాక్ జట్టును సిరీస్ అంటూ ఎందుకు ఆహ్వానించారంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇదే జట్టు ఏడాది క్రితం ఇంగ్లాండ్‌పై 2-2తో సిరీస్ డ్రా చేసుకున్న విషయం మీకు తెలియదా? అని చాపెల్‌ను ప్రశ్నించాడు.
అంతేకాదు ఫీల్డింగ్ లోపం వల్లే తమ జట్టు వైఫల్యాలు కొనసాగుతున్నాయని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. ఇటీవలే ముగిసిన టెస్టు సిరిస్ పరాజయంతో ఆసీస్ గడ్డపై వరుసగా పాకిస్థాన్ 12 టెస్టుల్లో పరాజయం పాలైంది.
దీంతో 'ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఇప్పటివరకూ నాలుగుసార్లు వైట్ వాష్ అయ్యింది. మూడేసి మ్యాచ్‌ల సిరీస్‌లను నాలుగుసార్లు కోల్పోయింది. మీరు గేమ్‌ను మెరుగుపరుచు కోలేకపోతే, పర్యటనల్ని పక్కన పెట్టి ఇంట్లోనే కూర్చోండి. ఎప్పుడూ చెత్త ప్రదర్శన చేసేటప్పుడు పర్యటనలకు ఎందుకు' అని చాపెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీ తీరుపై కూడా చాపెల్ స్పందించాడు. 'ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో సరైన నాయకుడు లేడు. ఆ జట్టు మిస్బా నుంచి ఏ రకమైన స్ఫూర్తిని పొందినట్లు కనబడటం లేదు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మార్పులు అనివార్యం' అని చాపెల్ విమర్శించాడు.