
రాజస్థాన్ రాయల్స్ స్టార్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మయర్ తన తొలి బిడ్డ బర్త్ కోసం ఐపీఎల్ నుంచి తాత్కాలికంగా వైదొలిగాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. వెస్టిండీస్‌లోని గయానాకు తిరిగి వెళ్లనున్న హెట్‌మయర్ అతని బిడ్డ పుట్టాక తిరిగి ఇండియాకు వచ్చి జట్టులో చేరుతాడు. ఈ సీజన్‌లో ఆర్ఆర్ సంచలన విజయాల్లో హెట్‌మెయర్ కీలక పాత్ర పోషించాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. జట్టు గెలుపు కోసం చివర్లో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
అతను లోయర్ ఆర్డర్‌లో ఉండడం జట్టు బ్యాటింగ్ లైనప్‌ను బలపరుస్తుంది. ఇక నిన్న కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో అజేయంగా 31పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ కింగ్స్‌ను శనివారం ఆరు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. ఇక తమ ఏడో విజయాన్ని నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్.. 14పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది.
'షిమ్రాన్ హెట్‌మయర్ తన మొదటి బిడ్డ బర్త్ కోసం ఈరోజు తెల్లవారుజామున గయానాకు వెళ్లాడు. ఈ శుభసందర్భంలో మేము అతనికి మా అభినందనలు తెలుపుతున్నాం. అతనికి మరియు అతని భార్య నిర్వాణికి మా శుభాకాంక్షలు. బిడ్డ బర్త్ అనంతరం షిమ్రాన్ ముంబైకి తిరిగి రావాలని, మళ్లీ జట్టులో చేరి రాయల్స్ బ్యాటింగ్‌ను తన బ్యాటింగ్‌తో దుర్భేద్యం చేయాలని కోరుకుంటున్నాము. అతని రాక కోసం మేము ఎదురుచూస్తుంటాం. ఆల్ ది బెస్ట్, హెటీ. ఈసారి తండ్రిగా మిమ్మల్ని తిరిగి చూడబోతున్నాం' అంటూ రాజస్థాన్ రాయల్స్ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ సీజన్‌లో హెట్‌మయర్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు. అతని సగటు 70కాగా, స్ట్రైక్ రేట్ 160గా ఉంది. ఒక ప్లేయర్‌గా హెట్‌మయర్ ఎంత సమర్థుడో ఈ గణాంకాలు చెబుతాయి. ఇక ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో హెట్‌మయర్ తాత్కాలికంగా జట్టుకు దూరం కావడం కాస్త లోటే అని చెప్పాలి. ఆర్ఆర్ మరో విజయం సాధిస్తే దాదాపు ప్లేఆఫ్ రేసుకు చేరుకుంటుంది. ఇంకా ఆర్ఆర్‌కు మూడు మ్యాచ్‌లు ఉన్నాయి.