
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో గయానా అమెజాన్ వారియర్స్ బోణి కొట్టింది. గురువారం రాత్రి సెయింట్ కిట్స్ వేదికగా ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచులో గయానా 9 పరుగుల తేడాతో గెలిచింది. హార్డ్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ (54, 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రొమారియో షెపర్డ్ (మూడు వికెట్లు), ఒడియన్ స్మిత్ (24 రన్స్, 2 వికెట్లు) గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఒడియన్ స్మిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. సీపీఎల్ 2021 ఈ రోజు నుంచే ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణేత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ పూర్తిగా నిరాశపరిచాడు. 17 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ చంద్రపాల్ హేమ్‌రాజ్ (13) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే ఒడియన్ స్మిత్ (24) కూడా చేతులెత్తేశాడు. దీంతో షిమ్రాన్ హెట్‌మైర్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజులో నిలబడ్డాడు. హఫీజ్, పూరన్, షెపర్డ్ అండతో జట్టుకు విలువైన పరుగులు అందించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసి.. ఇన్నింగ్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. హెట్‌మైర్ పుణ్యమాని గయానా పోరాడే స్కోర్ చేయగలిగింది.
143 పరుగుల సాధరణ లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రింబాగో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. సునీల్ నరైన్ (20) మెరిసినా.. మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ (5) నిరాశపరిచాడు. కోలిన్ మున్రో (13), టిమ్ సీఫెర్ట్ (23), డారెన్ బ్రేవో (3) నిరాశపరిచారు. దినేష్ రాందిన్ (28) ఆడుకున్నా.. కెప్టెన్ కీరన్ పోల్లర్డ్ (2) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో అకేల్ హోసిన్ (22) పోరాడినా.. అది సరిపోలేదు. ఒడియన్ స్మిత్, రొమారియో షెపర్డ్, ఇమ్రాన్ తాహిర్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి గయానాకు అద్భుత విజయం అందించారు.
సీపీఎల్ 2021లో భాగంగా జరిగే మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత్ సహా మరో 100 దేశాల్లో ఈ మ్యాచ్‌లు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్‌బుక్, యుట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నట్లు సీపీఎల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీట్ రస్సెల్స్ తెలిపారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు కొన్ని అంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టేడియాల్లోకి 50 శాతం మంది అభిమానులకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. సెప్టెంబర్ 15న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో సీపీఎల్ 2021 ముగియనుండగా.. నాలుగు రోజుల తర్వాత (సెప్టెంబర్19) యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 మలి దశ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.