హైదరాబాద్: యోగా తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధావన్ ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత అటు నుంచి అటే టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు క్రీడాకారులు యోగాసనాలు వేసిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న ధావన్ తాను యోగా చేస్తున్న ఓ ఫొటోను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు.

'నా నిత్య జీవితంలో యోగాకి ఎంతో ప్రాధాన్యత ఉంది. శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు యోగా ఎంతో తోడ్పాటునిస్తోంది' అని ధావన్ పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ, పారా ఒలింపిక్స్ పతక విజేత దీప మాలిక్ తదితరులు ట్విటర్ ద్వారా యోగాసనాలు వేసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 'బయట ఏం జరిగినా వాటిని మనం నియంత్రించలేం. మన లోపల ఏం జరుగుతున్నా నియంత్రించుకోవచ్చు. ఇది యోగా ద్వారా సాధ్యం' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే పారా ఒలింపిక్ పతక విజేత దీప మాలిక్ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన యోగ డేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి తదితరులు పాల్గొన్నారు.