
హైదరాబాద్: టీమిండియా బ్యాటింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. అతని కుటుంబాన్ని విమానం ఎక్కడానికి వీళ్లేదంటూ దుబాయ్ ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపేసింది. జనవరి 5న జరగాల్సి ఉన్న దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ ప్రాక్టీసు నిమిత్తం కుటుంబంతో కలిసి బయల్దేరిన శిఖర్ ధావన్‌కు పెద్ద చిక్కువచ్చి పడింది.
శిఖర్ ధావన్ అతని భార్య ఆయేషా ఇద్దరు పిల్లలతో కలిసి ముంబై నుంచి దుబాయ్ వెళ్లారు. అంతకుముందు ముంబైలో ధావన్ కాలికి చికిత్స చేయించుకుని ఫ్లైట్‌లో దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు దుబాయ్‌లో దిగారు. దుబాయ్ నుంచి కనెక్టడ్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉండగా వారి పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు చూపించాలంటూ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
ఆ సమయంలో వాటిని ధావన్ కుటుంబం తీసుకురాలేదు. దీంతో అవి తీసుకువచ్చేవరకు విమానం ఎక్కనివ్వబోమని సిబ్బంది ఆపేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ధావన్ కుటుంబం ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు.
'దీనికి కలత చెందిన ధావన్ ఎమిరేట్స్ చాలా అన్‌ప్రొఫెషనల్‌గా ప్రవర్తిస్తున్నారు. ఇదే పద్ధతి అనుసరించినట్లైతే మరి ముంబైలో దుబాయ్ ఫ్లైట్ ఎందుకు ఎక్కనిచ్చారు. సిబ్బందిలోని ఒక వ్యక్తి అయితే కారణం లేకుండానే గొడవ పెట్టుకున్నాడు.' అని తన బాధను ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లగక్కాడు.
దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్ మొత్తం మూడు టెస్ట్‌లు, ఆరు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆటగాళ్లు గురువారమే కేప్ టౌన్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌కు చేరుకున్నారు. విరాట్ కోహ్లీ సతీ సమేతంగా టూర్‌కి వచ్చిన సంగతి విదితమే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.