హైదరాబాద్: ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‌లో తొలి మూడు వన్డేలకు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మూడు వన్డేలకు సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టులో ధావన్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఉన్నపళంగా జట్టు నుంచి విడుదల చేస్తూ బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. తన భార్య అయేషా ముఖర్జీ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోందని, ఈ సమయంలో ఆమె పక్కనే ఉండాలని భావించిన ధావన్ తనను జట్టు నుంచి తప్పించాల్సిందిగా బీసీసీఐని కోరాడు.

ధావన్ కోరిక మేరకే ఆస్ట్రేలియాతో జరిగే తొలి మూడు వన్డేలకు ధావన్‌ను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అయితే అతని స్థానంలో మరే ఇతర క్రికెటర్ ని ఇంకా ఎంపిక చేయలేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో కూడా తన తల్లి అనారోగ్యంగా కారణంగా లంక పర్యటన నుంచి ఆకస్మికంగా తప్పుకున్న సంగతి తెలిసిందే.
దీంతో శ్రీలంకతో చివరి వన్డేతో పాటు ఏకైక టీ20కి ధావన్ దూరమయ్యాడు. శ్రీలంక పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్‌పై భారత్ అభిమానులతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ ఆశలు పెట్టుకున్న తరుణంలో అతను వైదొలగడం టీమిండియాను ఆందోళనలో పడేసింది.
కాగా, ధావన్ స్ధానాన్ని రహానే భర్తీ చేసే అవకాశం ఉంది. గత కొంతకాలంగా జట్టులో ఎంపిక అవుతున్నప్పటికీ రహానే రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతున్నారు. రహానే తమ మూడో ఓపెనర్ అని కోహ్లీ ఇంతకుముందే చెప్పడంతో ఇప్పుడు ఆసీస్‌తో సిరీస్‌లో రోహిత్‌తో కలిసి రహానే ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.