
హైదరాబాద్: జోహెన్స్‌బర్గ్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. తొలి 100 మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతేకాదు ఇప్పటివరకూ రెండో స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4217 పరుగులు)ను అధిగమించాడు.
ఈ జాబితాలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా (4808 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తరఫున తొలి వంద మ్యాచ్‌లతో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ కోహ్లీ పేరున ఉండగా దానిని ధావన్ తన 99వ మ్యాచ్‌లోనే దాన్ని అధిగమించిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ తొలి వంద మ్యాచ్‌లలో 48.89 సగటుతో 4107 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ 99 వన్డేల్లోనే 45.54 సగటుతో 4200 పరుగులు పూర్తి చేసి కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టాడు. ఇక, నాలుగో వన్డేకు వాతావరణ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. 34.2 ఓవర్ వద్ద వెలుతురు లేమితో పాటు, సన్నగా చినుకులు ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్ (107), రహానే (5) పరుగులతో ఉన్నారు. నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద రోహిత్‌శర్మ (5) రూపంలో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ధావన్‌తో కలిసి పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు వీరిద్దరూ 158 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ జోడీని విడదీయడానికి దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ ఎంత మంది బౌలర్లను మార్చిన ఫలితం లేకోపయింది.
చివరకు జట్టు స్కోరు 178 పరుగుల వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్లో డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ(75) వెనుదిరిగాడు. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి రహానే వచ్చాడు. మరో ఎండ్‌లో ధావన్ 91 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. ఈ వన్డేలోనూ కోహ్లీసేన విజయం సాధిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. తద్వారా సఫారీ గడ్డపై సిరీస్ నెగ్గిన జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టిస్తుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.