సిడ్నీ: ప్రపంచ కప్ టోర్నీ 2015లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్.. ప్రపంచ కప్ గెలవాలన్న తన కోరిక నెరవేర్చుకోలేకపోయాడు. ప్రపంచ కప్ నుంచి ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా నిష్ర్కమించడం కోట్లమంది అభిమానులకు నిరాక కలిగించింది. అందరికంటే ఎక్కువగా శిఖర్ ధావన్‌కు ఆవేదనను మిగిల్చింది.
కాగా, ఒక ప్రపంచ కప్ టోర్నీలో 400 పరుగులకు పైగా సాధించిన భారత దిగ్గజాల సరసన శిఖర్ చేరాడు. అతడు ఈ టోర్నీలో 449 పరుగులు చేసి ఈ ఘనతను సాధించాడు. ధావన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ ఘనతను సాధించారు.
1999 ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ఫాంను కనబర్చిన గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌లు ఈ ఫీట్‌ను సాధించారు. కాగా, సచిన్ టెండూల్కర్ మూడు సార్లు ఈ ఘనతను సాధించాడు. 1996, 2003, 2011లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీల్లో 400కుపైగా పరుగులు సాధించాడు. సచిన్ ఆడిన 2011 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది.

అయితే ధావన్‌కు ఆ అదృష్టం లేకపోయింది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ లాంటి దేశాలతో జరిగిన మ్యాచుల్లో శిఖర్ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంటు అందుకున్నాడు.
అయితే 329 పరుగుల భారీ లక్ష్యం ముందున్న సమయంలో శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్నిచ్చాడు. 45 పరుగులు చేసిన అనంతరం ధావన్.. జోష్ హజ్లేవుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కాగా, గురువారం సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఇంటి దారి పట్టగా, ఆసీస్ ఫైనల్ చేరుకుంది.