ప్రపంచ క్రికెట్‌లోనే శిఖర్ ధావన్ టాప్ బ్యాటర్ స్థాయికి చేరి ఎన్నో ఘనతలు సాధించాడు. ఐసీసీ టోర్నమెంట్స్‌లో
పరుగులు వరద పారించి రికార్డులు సృష్టించాడు. కానీ ప్రస్తుతం ధావన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. టీమిండియాకు అతడు దూరమై దాదాపు ఏడాది దాటింది. దీంతో అతడి బ్యాటింగ్ మెరుపులను తన అభిమానులు ఐపీఎల్‌లోనే చూడగలుగుతున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ప్రస్తుతం అతడు సన్నద్ధమవుతున్నాడు.
అయితే కెరీర్ పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ధావన్ కష్టకాలంలో ఉన్నాడు. తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయిన ఆనంతరం తన కొడుకు జొరావర్‌ను మిస్ అవుతూ మానసికంగా కృంగిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ధావన్ తన ఆవేదనను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. దేవుడి కరుణిస్తే తన కొడుకు జొరావర్‌తో కలిసి ఉండాలని ఉందని అన్నాడు.

''నా కొడుకుని చూడడం కోసం ఆస్ట్రేలియా వెళ్లాను. కానీ కొన్ని గంటలు మాత్రమే అతడితో ఉండే అవకాశం దక్కింది. జొరావర్‌తో కాసేపు సరదాగా సమయం గడపాలని, లాలించాలని, గుండెలకు హత్తుకోవాలని నాకు ఉంటుంది. నాన్నగా నా ప్రేమను పంచాలనిపిస్తుంది. కానీ, గత కొన్ని నెలలుగా అతడితో మాట్లాడే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు''
''అయినాసరే నేను సానుకూలంగానే ఉన్నా, నా కొడుకును అమితంగా ప్రేమిస్తూనే ఉన్నా. ప్రతిరోజు అతడికి మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నా. కానీ అతడు అవి చూస్తున్నాడో లేదో తెలియదు. కానీ తండ్రిగా ప్రయత్నిస్తున్నా. జొరావర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. దేవుడు కరుణిస్తే మా అబ్బాయితో కలిసి జీవిస్తాను'' అని ధావన్ వెల్లడించాడు.
ఇటీవల ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయిన సంగతి తెలిసిందే. తనను ఆయేషా మానసికంగా వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాలని ధావన్ కోర్టు మెట్లెక్కాడు. విచారణ జరిపిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీని కోరిన ధావన్ అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. కానీ ఫోన్‌లో మాట్లాడొచ్చని, స్కూల్ సెలవుల సమయంలో తన కుమారుడితో భారత్‌లో కలిసి ఉండవచ్చని చెప్పింది. దానికి తగ్గట్టుగా అయేషా సహకరించాలని తెలిపింది.